సమావేశంలో పాల్గొన్న నాయకులు
పుట్టపర్తి రూరల్ : ఈనెల 5న జరిగే నిరసన ర్యాలీ లలో ఉద్యోగ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సిఐటియు జిల్లా కార్యాలయం లో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ మాట్లాడుతూ కార్మికవర్గానికి ప్రస్తుతం వున్న కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్ ముఖ్య ఉద్దేశం అన్నారు. సరళీకరణ విధానాల అమలులో భాగంగా ప్రస్తుత కార్మిక చట్టాలు తెలుస్తున్నారన్నారు. కార్మికహక్కులు కాలరాసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేయడానికి లేబర్ కోడ్ ను తెచ్చారన్నారు. కార్మిక చట్టాలు అమలులోకి తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా పనిచేయించి దోపిడీని మరింత తీవ్రతరం చేయబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికవర్గాన్ని చైతన్యపరిచి, లేబర్ కోడ్ ప్రమాదాన్ని వివరించడం జరుగుతుందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయితే కార్మిక వర్గం నిరవధిక సమ్మెలకు సిద్ధంకావాలి, లేకుంటే కార్మికవర్గం బ్రతకడమే కష్టమవుతుందని అన్నారు. ఏ హక్కులు లేనప్పుడే కార్మిక వర్గం పోరాడే హక్కులు సాధించిందని గుర్తు చేశారు. ఉన్న హక్కులు లేకుండా చేస్తామంటే కార్మికవర్గం కళ్లు ముకునుకొని కూర్చో దన్నారు. కార్యక్రమంలో సిఐటియు పుట్టపర్తి కోకన్వీనర్ పెడపల్లి బాబా, బుక్కపట్నం మండల కన్వీనర్ బ్యాళ్ళ అంజి, కొత్తచెరువు మండల కన్వీనర్ ముత్యాలు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.