వేలం రద్దుపై అనుమానాలు

Mar 19,2025 22:05

వేలం పాటను నిర్వహిస్తున్న మున్సిపల్‌ అధికారులు

                    హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వేలం పాటలో కొన్నింటికి నిర్వహించాల్సిన వేలాలను రద్దు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దినసరి కూరగాయల మార్కెట్‌, రోడ్డు మార్జిన్‌ లపై విక్రయాలు చేస్తున్న వారిపై సుంకం వసూలు తీసుకోవడానికి, అదేవిధంగా చిన్న పశువులు వాటి తోళ్ల మార్కెట్‌, పెద్ద పశువులు వాటి తోళ్ల మార్కెట్‌, పరిగి బస్టాండు ఆవరణంలోని ఖాళీ స్థలములలో వాహనాలకు ఫీజు వసూలుకు సంబంధించి మున్సిపల్‌ కమిషనర్‌ సంగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలో బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. ఇందులో తొలత పరిగి బస్టాండ్‌ ఆవరణంలోని ఖాళీ స్థలమునకు బహిరంగ వేలాన్ని అధికారులు రూ. 19.22 లక్షల సర్కారీ వారి పాటతో వేలం ప్రారంభించారు. దీనిని అన్వర్‌ రూ. 21.75 లక్షలకు దక్కించుకున్నారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇదే స్థలం రూ. 21.10 లక్షలకు పోయింది. అనంతరం చిన్న పశువులు వాటి తోళ్ల మార్కెట్‌ బహిరంగ వేలం నిర్వహించగా రూ 7.30 లక్షలకు మాయే జబీన్‌ పాటను దక్కించుకున్నారు. అనంతరం పురపాలక సంఘ దినసరి కూరగాయల మార్కెట్‌, రోడ్డు మార్జిన్‌ లపై అమ్ముకునే వస్తువులపై సుంకం వసూలు చేయడానికి కోసం బహిరంగ వేలం నిర్వహించారు. అధికారులు మూడు సంవత్సరాల సరాసరిని లెక్కించి రూ. 42.18 లక్షలతో పాటను ప్రారంభించారు. దీనికోసం గుత్తేదారులు పోటీపడి మరి వేలంలో పాల్గొన్నారు. తొలుత అల్తాఫ్‌ అనే గుత్తేదారుడు రూ 4.30 లక్షలతో పాట ప్రారంభించగా రూ. 64.25 లక్షల వరకు గుత్తేదారులు పోటీపడ్డారు. అయితే మున్సిపల్‌ కమిషనర్‌ అనుకున్న దానికన్నా గుత్తేదారులు అధికంగా పాడుతున్నారని గ్రహించి వేలంపాటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అప్పటికే పరిగి బస్టాండ్‌ ఆవరణంలోని ఖాళీ స్థలం, చిన్న పశువులు వాటి తోళ్ల మార్కెట్‌ కు సంబంధించి వేలం నిర్వహించిన వాటిని ఖరారు చేసి, పురపాలక సంఘం దినసరి కూరగాయల మార్కెట్‌, పెద్ద పశువులు వాటి తోళ్ల మార్కెట్‌ కు సంబంధించి వేలంపాటలను రద్దు చేస్తున్నట్లు రెవిన్యూ అధికారిణి విజయభారతి పేర్కొన్నారు. అయితే పురపాలక సంఘానికి దినసరి కూరగాయల మార్కెట్‌ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్‌ అధికారులు నిర్ణయించిన దానికన్నా రూ. 22 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నప్పటికీ బహిరంగ వేలం నిర్వహించకుండా వాయిదా వేయడంలో ఆంతర్యం ఏమిటన్నది అర్థం కావడం లేదు. వేలంపాట ఇదేవిధంగా కొనసాగి ఉంటే దాదాపు దినసరి కూరగాయల మార్కెట్‌ రూ. 80 లక్షల వరకు గుత్తేదారులు పాడేవారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 42 లక్షలకు అధికారికంగా దక్కించుకున్న గుత్తేదారుడు అనధికారికంగా రూ. 75 లక్షలకు ఇతరులకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు ఆదాయం వస్తుందని తెలిసినప్పటికీ అర్ధాంతరంగా బహిరంగ వేలం పాట రద్దు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దినసరి కూరగాయల మార్కెట్‌ బహిరంగ వేలంను పకడ్బందీగా నిర్వహిస్తే పురపాలికకు భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బహిరంగ వేలంలో మున్సిపల్‌ కమిషనర్‌ తో పాటు మేనేజర్‌ సుధాకర్‌, రెవిన్యూ అధికారిణి విజయభారతి, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ రాము, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️