నివురుగప్పిన నిప్పులా తాడిపత్రి

పోలీసుల పహారా నేపథ్యంలో నిర్మాణుష్యంగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి నివాసం

       తాడిపత్రి రూరల్‌ : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల పోలింగ్‌ రోజున మొదలైన గొడవ ఇంకా సర్ధుమనగలేదు. నివురుగప్పిన నిప్పులా ఎప్పుడే ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. పోలింగ్‌ అనంతరం మంగళవారం నాడు కొనసాగిన పరస్పర దాడుల్లో టిడిపి, వైసిపి నాయకులు గాయపడ్డారు. వీటిని నిలువరించేందుకు వెళ్లిన పోలీసు, మిలటరీ సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు. బుధవారం నాడు కూడా టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో తాడిపత్రిలో మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. డిఐజి, ఎస్పీ పక్క జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర, రాష్ట్ర, జిల్లాల బలగాలను మోహరింపజేశారు. బుధవారం తెల్లవారుజామున 3గంటల నుంచి పక్కా ప్రణాళికతో తాడిపత్రి పట్టణాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి కార్యాలయాల వద్ద పోలీసు బలగాలను మోహరింపజేశారు. వారివారి కార్యాలయాల్లో ఉన్న వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పలువురిని అదుపులోకి తీసుకుని దాడులకు సంబంధించి విచారణ సైతం చేస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతల దష్ట్యా పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా పట్టణంలోకి కొత్తవారు ఎవరూ ప్రవేశించకుండా నలువైపులా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. కొత్తవారు ఎవరినీ లోపలికి అనుమతించకుండా కట్టడి చేశారు. తాడిపత్రిలో వైద్యం, ఇతర అత్యవసరాలకు వెళ్లే వారికి మాత్రమే అనుమతిస్తూ చర్యలు తీసుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పట్టణంలో పనిచేసే కూలీలు, కార్మికులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. వారివారి వ్యాపారాలను వదిలేసుకుని వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు కూడా నిత్యావసరాలు అందక ఇబ్బంది పడ్డారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు చేపట్టిన చర్యలతో పట్టణంలో ప్రధాన రోడ్లు నిర్మానుషంగా మారాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్దకు ఎవరినీ అనుమతించకపోవడంతో అ ప్రాంతం నిర్మాణుష్యం అయ్యింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే అక్కడున్న వారందరినీ చెదరగొట్టారు. ఎవరూ అక్కడ ఉండేందుకు వీల్లేదంటూ గట్టి హెచ్చరికలు చేశారు. తాడిపత్రి పట్టణంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా టిడిపి, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దారెడ్డి, అస్మిత్‌రెడ్డిలతో రెండు పార్టీల ప్రధాన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్య నాయకులు అందరిని కూడా పక్క జిల్లా పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి అక్కడి ఉంచినట్లు తెలుస్తోంది. మండల, పట్టణ ముఖ్య నాయకులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్య నాయకులందరినీ పోలీసులు వారి అదుపులో ఉంచుకోవడంతో బుధవారం మధ్యాహ్నం సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ‘తమ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి డోర్లు బద్దలు కొట్టారు. కంప్యూటర్లు హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేశారు. పోలీసుల చర్యలపై తాను ఈసీకి ఫిర్యాదు చేస్తా’ అని ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పెద్దారెడ్డి బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. జిల్లా ఏఎస్పీ రామకృష్ణ టిడిపికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆయన అండతోనే జెసి.ప్రభాకర్‌ రెడ్డి రెచ్చిపోయి తాడిపత్రిలో గొడవలు సష్టిస్తున్నారని తెలిపారు. ఎఎస్పీపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసి సస్పెండ్‌ చేయమని కోరుతామన్నారు.

జెసి.ప్రభాకర్‌రెడ్డికి అస్వస్థతత

    తాడిపత్రిలో మంగళవారం నాడు టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య జరిగిన దాడుల నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ సమయంలో దట్టమైన పొగ వ్యాపించగా దానిని పీల్చిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అవస్థతకు గురయ్యారు. పొగ ఊపిరితిత్తుల్లో చేరుకుందని స్థానిక వైద్యులు చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

➡️