నాయకులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్
ధర్మవరం రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజలు కార్యకర్తలతో సమావేశమై ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీల్లో ఇంటింటికీ చెత్త సేకరణ జరగడం లేదని, డ్రైనేజీలు శుభ్రం చేయలేదని, చేనేతలకు కరెంటు సబ్సిడీ అందడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. 8వ వార్డులో రైల్వే సరిహద్దు గోడ నిర్మాణం, సీసీ కాల్వ నిర్మాణం, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరులో ఆలస్యం వంటి సమస్యలు శ్రీరామ్ దష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడి వీటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు పరిసే సుధాకర్, మాధవరెడ్డి అత్తర్ రహీం బాషా, అంబటి సనత్, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.