కబ్జాకు గురైన పెన్నా కుమద్వతి ప్రాజెక్టుకు చెందిన కాలువ
హిందూపురం : ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుని చర్యలు తీసుకోక పోవడమే ఆక్రమణదారులకు కొండంత వరంగా మారింది. దీంతో పట్టణంలోని పెన్నా కుమధ్వాతి ప్రాజెక్టుకు చెందిన కాలువ ఆక్రమణకు గురైంది. రెవెన్యూ శాఖ ఏకంగా అందులో కొంతమందికి పట్టాలను సైతం ఇవ్వడం గమనార్హం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కబ్జాదారులకు నాయకుల అండదండలు ఉంటే చాలు కాదేది కబ్జాకు అనర్హం అన్నచందంగా ప్రభుత్వ స్థలం ఏ శాఖకు చెందినదైన కబ్జాదారుల కన్ను పడితే చాలు కబ్జాకు గురి అవుతోంది. పెన్న కుమధ్వతి ప్రాజెక్టు నుంచి కొట్నూరు చెరువును కలుపుతూ కాలువ ఉంది. ఈ కాలువకు సంబంధించిన స్థలాలను ఆక్రమణదారులు కబ్జాలు చేసుకుని గృహాలు నిర్మాణం చేసుకోవడంతో పాటు వాణిజ్య భవనాలను సైతం నిర్మించుకున్నారు. దీంతోపాటు హిందూపురం పట్టణానికి మూడు వైపులా ప్రధాన చెరువులు ఉన్నాయి. కాలువ స్థలాన్ని కాకుండా చెరువులను సైతం కబ్జా చేసుకుని భవంతులను నిర్మించుకున్నారు. కొంతమంది అయితే ఏకంగా చెరువు స్థలాల్లో ప్లాట్లు వేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎప్పటి కప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెరువులన్నీ పూడికతో పూడుకు పోయినప్పటికీ ఏ మాత్రం పట్టించు కోలేదు. పురపాలక శాఖ ప్రజా అవసరాల నిమిత్తం ఇరిగేషన్ కాలువలను మురుగు కాలువలుగా మార్చుకుంది. దీనిపై సైతం ఇరిగేషన్ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులకు నామమాత్రపు లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. దీంతో పట్టణంలో ఉన్న చెరువులన్నీ మురుగు కూపాలుగా మారిపోయాయి. ఈ శాఖ పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని పరిరక్షించాల్సిన రెవిన్యూ శాఖ అధికారులు ఇరిగేషన్ స్థలాలకు సైతం పట్టాలను మంజూరు చేసి అక్రమణదారులకు సర్వహక్కులను కల్పించారు. దీంతో పట్టణంలో ఇరిగేషన్ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు వాటికి పట్టాలను సృష్టించి నిర్మాణాలు చేసుకోవడం, వాటిని విక్రయించడం పరిపాటిగా మారింది. ఇక పట్టణంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖకు ఉంది. ఈ శాఖ అయితే స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి నీటిపారుదల శాఖకు సంబంధించిన కాలువలను మురుగు కాలువలుగా మార్చుకుని, మున్సిపల్ నిధులను అడ్డంగా దోచుకుంటోందన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఇలా మూడు శాఖల అధికారుల నిర్లక్ష్యానికి పట్టణంలో ఉన్న నీటిపారుదల శాఖ స్థలాలన్నీ కబ్జాదారుల హస్తగతమవుతున్నాయి.
చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశాం
పెన్నా కుమధ్వతి ప్రాజెక్ట్ నుంచి కొట్నూరు చెరువును కలుపుతూ ఉన్న కాలువను కొంతమంది కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణాలను చేసుకున్నారు. 2023 జూన్ 9వ తేదీన అప్పటి తహశీల్దార్ హసీనా సుల్తానా పట్టణంలో నీటి పారుదల శాఖకు చెందిన స్థలాల్లో కబ్జాకు గురి అయిన వాటి వివరాలను ఇవ్వాలని ఇరిగేషన్ శాఖకు కోరారు. దీంతో సమగ్ర సర్వే నిర్వహించి 103 మంది తమ ఆధీనంలో ఉన్న స్థలాలను కబ్జా చేసుకున్నారని అన్ని వివరాలతో అదే సంవత్సరం జూన్ 15వ తేదీన సమగ్ర నివేదికను అందజేశాం. దీంతో పాటు మున్సిపల్ శాఖ అధికారులకు నీటి పారుదల శాఖకు సంబంధించిన కాలువలను మురుగు కాలువలుగా ఎలా మార్చారన్న విషయంలో నోటీసు ఇచ్చాం. అయితే వారు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం తమ శాఖకు ఇవ్వలేదు. తాజాగా ప్రజాశక్తిలో కథనం రావడంతో మరో సారి సైతం మున్సిపల్ కమిషనర్‌కు కాలువల దిశను మార్చుకోవాలని లేఖ రాశాం.
యోగానంద డిఇ, నీటిపారుదల శాఖ
తమ శాఖకు సంబంధం లేదు
నీటి పారుదల శాఖకు సంబంధించిన స్థలాల విషయంలో తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. వారి స్థలాలను వారే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.ప్రభుత్వ స్థలాలను మాత్రమే తమ శాఖ పరిరక్షించుకుంటుంది.
వెంకటేశు, తహశీల్దార్, హిందూపురం