వడ్డె ఓబన్నకు నివాళులు అర్పిస్తున్న కలెక్టర్ టిఎస్.చేతన్
ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్
స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని పలువురు నాయకులు, అధికారులు కొనియాడారు. వడ్డె ఓబన్న జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా శనివారం నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వడ్డె ఓబన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ టిఎస్.చేతన్, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డిలు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ విజయ సారధి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీసీ సంక్షేమ అధికారులు వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో ఓబన్న ప్రముఖ పాత్ర వహించారన్నారు. గ్రామ రక్షకుడిగా పనిచేసిన ఆయన జీతాలు రద్దు చేయడంతో గ్రామ రక్షకుల హక్కుల కోసం పోరు సాగించారన్నారు. సుమారు 9 వేల మంది సైనికులతో బ్రిటిష్ వారిని ఎదిరించాడన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహాలు ఏర్పాటుకు కషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి, వడ్డెర్ల సంఘం జిల్లా నాయకులు గోగుల చక్రపాణి, పల్లపు జయచంద్ర, కృష్ణమూర్తి, సంపంగి గోవర్ధన్, డాక్టర్ తిరుపతేంద్ర, జెవి.రమణ, క్రిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయం నివాళి
పుట్టపర్తి రూరల్: : జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వి.రత్న ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వడ్డే ఓబన్న జీవితం అందరికీ ఆదర్శనీయమని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, డిసిఆర్‌బి సిఐ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహ్మద్ వలి, మహేష్, ఎస్‌బి ఎస్‌ఐ ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.