లైనింగ్ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లె సింధూర
కొత్త చెరువు : హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులను నింపి చివరి ఆయకట్టు వరకు రైతాంగానికి నీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామ సమీపంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరిగేషన్ ప్రాజెక్టులకు తిరిగి పెద్దపీట వేసి రైతుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లా వరకు హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను వంద రోజుల్లో పూర్తి చేసే విధంగాకార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో సుమారు 68 కిమీ లో వరకు రూ.425 కోట్లతో ఈ లైనింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. లైనింగ్ పనులు పూర్తి చేసుకుంటే ఈ ప్రాంతానికి సుమారు 2800 క్యుసెక్కులు నీరు తీసుకోవచ్చన్నారు. లైనింగ్ పనులు జులై 10 లోపల పూర్తి చేస్తే వచ్చే సెప్టెంబర్ మాసంలో పుట్టపర్తి నియోజకవర్గం లో ఉన్న చెరువులకు నీళ్లు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ తాజా స్వరూప్, ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్ వి ఆర్ ఎండి రాయల్ రఘు, వైస్ ప్రెసిడెంట్ రఘురామరాజు, డైరెక్టర్ కృష్ణయ్య కాంట్రాక్టర్ అనూప్, డి ఎ శ్రీనివాస్, జై ప్రసన్న, మరవ కుంటపల్లి మాజీ సర్పంచి రమేష్ రెడ్డి, కొత్తచెరువు పట్టణ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, టిడిపి సీనియర్ నాయకులు సాలక్క గారి శ్రీనివాసులు, సామకోటి ఆదినారాయణ తదితరులతో పాటు కంపెనీ ప్రతినిధులు సయ్యద్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.