చితికిన చిన్ననీటి పారుదల..!

 

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

జిల్లాలో చిన్ననీటి పారుదల శాఖలో పనులు ఎక్కడివక్కడే అన్న చందంగా మారాయి. జపాన్‌ బ్యాంకు సహకారంతో చేపట్టన పనులతోపాటు విపత్తు నిధుల కింద మంజూరైన పనులు కూడా ఏడాదిగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రూ.134.18 కోట్ల పనులు చేపడితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 60 పనులు చెరువుల మరమ్మతులు, అభివృద్ధి కోసం చేపట్టిన ఈ పనులు కొన్ని మధ్యలోనే ఆగిపోగా, మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉండిపోయాయి. జపాన్‌ బ్యాంకు నిధులతో ఎపిఐఎల్‌ఐపి కింద ఐదు పనులు చేపట్టారు. వీటి విలువ రూ.5.93 కోట్లు ఉంది. ఐదు పనుల్లో నాలుగు పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. ఒక్క పని పురోగతిలో ఉందని చెబుతున్నా, ఆశించిన పురోగతి లేదు. అదే నిధుల కిందే మరో పనిని చేపట్టారు. రూ.9.25 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టరు బిల్లులు రాక ఆపేశారు. నాబార్డు నిధులతో చేపట్టిన రూ.9.30 లక్షల పనుల పరిస్థితి ఇదే రకంగా ఉంది. పని పూర్తవకనే ముగించేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధమయ్యారు. సాధారణ రాష్ట్ర బడ్జెట్‌ కింద ఆరు పనులను రూ.61.88 కోట్లతో చేపట్టిన వాటిల్లో ఒక పని కాంట్రాక్టరు నిలిపివేసి ఉండగా, రెండు పనులు ప్రారంభమవ్వాల్సి ఉంది. తక్కిన పనులు సాంకేతిక సమస్యలతో ఆగాయి. స్టేట్‌ డెవలెప్‌మెంట్‌ స్కీమ్‌ కింద రూ.4.66 కోట్లతో చేపట్టిన పనులను కాంట్రాక్టర్‌ ఆపేశాడు. విపత్తుల నిధి కింద రూ.48.50 లక్షలతో చేపట్టిన నాలుగు పనులు ఎంఒయు దశలో ఉన్నాయి. అదే నిధులతో మధ్యతరహా ప్రాజెక్టు పనులు పది చేపట్టారు. రూ.3.81 కోట్ల పనులు టెండరు దశలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు నిధులతో 32 పనులు రూ.48.02 కోట్లతో చేపట్టారు. ఇందులో తొమ్మిది పనులు కాంట్రాక్టర్లు నిలిపేశారు. 11 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. తక్కినవి మధ్యలో నడుస్తున్నాయి. ఇలా మొత్తంగా చూసినప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో చిన్ననీటి పారుదల శాఖ పరిధిలో ఒక్క పనీ పూర్తవలేదు. ఒక్క రూపాయి నిధులు కూడా ఖర్చుపెట్టిన దాఖలాల్లేవు.

కీలకమైన ఈ శాఖ పనితీరు ఇలా ?

           వర్షాభావ ప్రాంతమైన అనంతపురం జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ ఎంతో కీలకమైంది. ఎప్పుడో ఒకసారి పడే వర్షాన్ని ఒడిపట్టుకుని నిలువ ఉంచుకోవడం ద్వారా రెండు, మూడు సంవత్సరాలు కరువును ఎదుర్కొనేందుకు వీలుంటుంది. చెరువుల్లోకి వర్షం నీరు చేరితే గండ్లు పడిపోయే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీటి మరమ్మతులు, నిర్వహణను ప్రభుత్వాలు పూర్తిగా ఎత్తిపెట్లేశాయన్న విమర్శలున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అనేక చెరువులకు గండ్లు పడి నీరు వృథాగాపోయిన విషయం తెలిసిందే. చిన్ననీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు.

➡️