ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేస్తున్న స్థానికులు
పుట్టపర్తి క్రైమ్ : పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపాన మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయొద్దని స్థానిక ప్రజలు కోరారు. ఈ మేరకు వారు బుధవారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవింద్ నాయక్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇక్కడ దుకాణాన్ని ఏర్పాటు చేస్తే సత్యసాయి బాబా భక్తులు, పర్యాటకులు అసౌకర్యానికి గురవుతారని తెలిపారు. దీనివల్ల ప్రశాంతి నిలయానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అంతే కాకుండా మద్యం సేవించే వారితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గతంలో ప్రశాంతి నిలయానికి 10 కిలోమీటర్ల దూరంలో మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు, సినిమా థియేటర్లు ఉండాలని సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు అప్పటి ప్రభుత్వానికి విన్నవించారన్నారు. అందుకు స్పందించిన ప్రభుత్వం ఈ విన్నపానికి అనుగుణంగానే నిబంధనలను విధించిందన్నారు. కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ప్రధాన రహదారి కూత వేటు దూరంలోనే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతుండడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మద్యం దుకాణాలను 10 కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయించాలని కోరారు. లేనిపక్షంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కేశవయ్య, రవి నాయక్, పవన్ తదితరులు పాల్గొన్నారు.