శిక్షణ తరగతులు రద్దు చేయాలి

Nov 28,2024 21:05

 నినాదాలు చేస్తున్న నాయకులు

              నంబులపూలకుంట : ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌, లీడర్‌షిప్‌ శిక్షణ తరగతులను తక్షణం రద్దు చేసి నాన్‌ రెసిడెన్షియల్‌ పద్దతిలో వేసవిసెలవుల్లో శిక్షణా తరగతులను నిర్వహించాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడి మధ్య రెసిడెన్షియల్‌ శిక్షణా తరగతులు నిర్వహించడం సరికాదన్నారు. ఇదివరకే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు మానసిక ఒత్తిడి భరించలేక ప్రాణాలు వదలడం బాధాకరమన్నారు. ఒకవైపు మానసిక ఒత్తిడికి గురై ఉపాధ్యాయులు ప్రాణాలు వదలుతున్నా శిక్షణా తరగతులను రద్దు చేయకపోవడం దారుణమన్నారు. పాఠశాలల్లో రోజురోజుకు వివిధ రకాల బోధనేతర పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారన్నారు. ఒత్తిడి మధ్య రెసిడెన్షియల్‌ శిక్షణ పేరుతో అరకొర వసతులు కలిగిన మారుమూల కేంద్రాలలో శిక్షణలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. వయసు పైబడిన, అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఉపాధ్యాయులు, మహిళలు, చంటి పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు శిక్షణ కేంద్రాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వెంటనే శిక్షణలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు జిల్లా గౌరవాధ్యక్షులు రామాంజులు యాదవ్‌, జిల్లా కౌన్సిలర్‌ రమణా నాయక్‌, మురళి, శివయ్య, సందీప్‌, గోవర్దన్‌ రెడ్డి, వెంకట రమణారెడ్డి, రహీం ,రామ్మోహన్‌, లాలూ సాబ్‌, షఫీ, ముషీర్‌ అహ్మద్‌, సుదర్శన్‌ గోపాల్‌, రమణయ్య, ముబారక్‌ అలీ ఖాన్‌, వరలక్ష్మీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఓబుల దేవర చెరువు : రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్‌ శిక్షణా తరగతులను వెంటనే రద్దుచేయాలని డెమాక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు గౌస్‌ లాజమ్‌, డిమాండ్‌ చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాల్ట్‌ పథకం కింద నిర్వహిస్తున్న రెసిడెన్షియల్‌ శిక్షణల్లో ఉపాధ్యాయులు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆ పరిస్థితుల్లో ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో రత్నకుమార్‌, విజయనగరంలో శ్రీనివాసరావు మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి శిక్షణలన్నీ జిల్లా కేంద్రాల్లో నాన్‌ రెసిడెన్షియల్‌ విధానంలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం నాయకులు నర్సింహులు, సోమశేఖర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️