కష్టాలను భరించలేక.. కన్నప్రేమను వదిలుండలేక..!

మహిళకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-కదిరి టౌన్‌

      ఈ సృష్టిలో ఎంతో విలువైనది, అపురూపమైనది అమ్మ ప్రేమ. అమ్మ నీడన అడుగులేస్తూ సాగించే జీవన ప్రయాణం అందమైన జీవితాన్ని ఇస్తుంది. అలాంటి అమ్మను కష్టాలు వెంటాడాయి. ఆదుకుని అక్కున చేర్చుకునే వారు కన్పించకపోవడంతో ఆమె జీవితం చీకటిమయం అయ్యింది. కష్టాల సుడిగుండంలో ఉన్న తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. తాను మరణించినా తన కూతురు బతికుండాలన్న ఉద్ధేశంతో చిన్నారిని ఇతరుల చేతుల్లో పెట్టి చావును వెతుక్కుంటూ వెళ్లింది. చావాలని ఎంత ప్రయత్నించినా తన కూతురు పదేపదే గుర్తుకు రావడంతో కన్నప్రేమను వదిలుండలేక తిరిగి వెనక్కు వచ్చేసింది. తన కూతురిని తనకు ఇవ్వాలంటూ పోలీసుల ఎదుట వాపోయింది. కదిరి ఆర్టీసీ బస్టాండులో ఆదివారం నాడు ఓ చిన్నారని వదిలేసి వెళ్లిన ఘటన తల్లి వెనక్కు రావడంతో సుఖాంతం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి కదిరి సిఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గలగల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు పెళ్లి అయ్యింది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సాఫీగా సాగుతున్న ఈమె జీవనం భర్త మరణంతో కష్టాలమయం అయ్యింది. భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను అత్త మాములు చదివిస్తామని చెప్పారు. దీంతో ఆమె జీవనోపాధి నిమిత్తం బెంగుళూరుకు వలస వెళ్లింది. ఈ క్రమంలో కర్నాటక రాష్ట్రం దొడ్డబల్లాపూర్‌ జిల్లా బేతం గ్రామానికి చెందిన కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను అండగా ఉంటానని మహిళకు చెప్పడంతో ఆమె అతన్ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ పాప పుట్టింది. ప్రస్తుతం వీరికి ఏడాది లోపు వయస్సున్న ఆడ బిడ్డ ఉంది. ఇటీవల భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో జ్యోతి జీవితంపై విరక్తి చెందింది. రెండు రోజుల క్రితం తన కూతురిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎలాగోలా ఆదివారం మధ్యాహ్నం కదిరికి చేరుకున్న ఆమెకు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఇక తన కష్టాలకు చావే పరిష్కారం అని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. తాను చనిపోయినా తన కూతురు బతికుండాలని భావించి ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ విద్యార్థినికి తన కూతుర్ని ఇచ్చి వెళ్లిపోయింది. మహిళ ఎంత సేపటికీ రాకపోవడంతో విద్యార్థిని ఆర్టీసీ అధికారుల సాయంతో చిన్నారిని పోలీసులకు అప్పజెప్పింది.

కూతురిని వదిలి ఉండలేక..

       ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన మహిళ కదిరి సమీపంలోని పలు ప్రాంతాలకు కాలినడకన వెళ్లింది. పదేపదే తన కూతురు గుర్తుకు రావడంతో ఆత్మహత్య చేసుకోలేకపోయింది. ఇదే సమయంలో ఈ మహిళను గుర్తించిన స్థానికులు ప్రశ్నించారు. ఆమె పరిస్థితి కొంత అనుమానంగా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం వెల్లడించింది. వెంటనే పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కాగా ప్రస్తుతం మహిళ కూతురు పుట్టపర్తిలోని శిశు విహార్‌లో ఉందని, బంధువుల సమక్షంలో బిడ్డను ఆమెకు అప్పగిస్తామని సిఐ నారాయణరెడ్డి తెలిపారు.

➡️