రైతు, కార్మిక వ్యతిరేక పాలనపై ఐక్య ఉద్యమాలు..!

కలెక్టరేట్‌ వద్ద బైటాయించి నిరసన తెలుపుతున్న రైతు, కార్మిక సంఘాల నాయకులు

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌

రైతు, కార్మిక వ్యతిరేక విధనాలను నిరసిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక, రైతు, వ్యవసాయ, కూలీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నాను చేపట్టారు. సిఐటియు, ఎఐటియుసి ఎపి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు పెద్దఎత్తున గణేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద బైటాయించి మహాధర్నా కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతు, కార్మికులు హాజరై మహాధర్నాను విజయవంతం చేశారు.

రైతులు, కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం నాడు కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఇంతియాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌, ఎఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు వేమయ్య యాదవ్‌ మాట్లాడుతూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా కార్మికుల హక్కుల కోసం జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టామన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కుదిచ్చి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా బిజెపి ప్రభుత్వం చేయడం కార్మికుల హక్కులను కాలరాయడమే అన్నారు. రైతు నల్ల చట్టాల రద్దు సందర్భంగా రైతాంగానికి మోడీ ఇచ్చిన హామీలు మూడేళ్ల అవుతున్నా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్‌ శక్తుల కొమ్ముకాస్తూ కార్మికుల, కర్షకులు హక్కులను కాలరాసేలా ప్రధాని మోడీ పాలన సాగుతోందన్నారు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలల అయినా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒక గ్యాస్‌ పథకం తప్ప మిగతావి అమలు చేయలేదని విమర్శించారు. చిరు ఉద్యోగులపై కక్షకట్టి వారిని విధుల నుంచి అకారణంగా తొలగిస్తున్నారన్నారు. అధికార పార్టీ అనుకూలమైన వారిని విధుల్లోకి తీసుకుంటున్నారన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గతంలో రద్దు చేసిన నల్ల చట్టాలని మళ్లీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో కార్మికులు కర్షకులు ప్రధాన ఉత్పాదశక్తులుగా ఉన్నారని వారిపై కక్ష కట్టి వారి హక్కులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నా నియంత్రించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధనాలను మానుకోకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం అవుతామన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ రైతు సంఘం కార్యదర్శి బడా సుబ్బారెడ్డి, అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, శ్రామిక మహిళ కార్యదర్శి దిల్షాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌, ఐద్వా కార్యదర్శి నాగమణి, శ్రావణి, సిఐటియు నాయకులు, జిఎల్‌.నరసింహులు, లక్ష్మీనారాయణ, రమేష్‌, బ్యాళ్ల అంజి, పైపల్లి గంగాధర్‌, పెడపల్లి బాబా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాటమయ్య, బాలకాశి, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, అశోక్‌, గిరి పాల్గొన్నారు.

➡️