పార్టీ ఫిరాయింపు కౌన్సిలర్లకు విప్‌ జారీ : వైసిపి

Feb 2,2025 22:14

సమావేశంలో మాట్లాడుతున్న ఉషాశ్రీ చరణ్‌

                            హిందూపురం : ఒక పార్టీ సింబల్‌ పై గెలిచి, పార్టీ ఫిరాయింపు చేసిన కౌన్సిలర్లందరికీ విప్‌ జారీ చేశామని దీనిని ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకుంటామనివైసిపి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పై చేయి సాధించాలని వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసిందని విమర్శించారు. ప్రలోభాలకు గురి కాని వారిని భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలోకి చేర్చుకొని తమ బలాన్ని అడ్డదారిన నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తోందన్నారు.. ఇది అప్రజాస్వామ్యమని అన్నారు. ఒక పార్టీ సింబల్‌ పై గెలిచిన వారిని ప్రలోభాలకు గురిచేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే గెలిచిన పార్టీ విప్‌ జారీ చేస్తే వారి ఓటు హక్కు చల్లదని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని కోరారు. సోమవారం జరిగే హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక అన్నారు. అధికారులు అధికార పార్టీకి అండగా పనిచేయకుండా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలన్నారు. లేనిపక్షంలో స్థానిక అధికారులపై ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తామన్నారు. విప్‌ జారీ చేసినప్పటికీ కౌన్సిలర్లు అతిక్రమిస్తే వారి పదవిని కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి దీపిక, మున్సిపల్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️