లైంగిక వేధింపుల పట్ల అప్రమత్తత అవసరం

Mar 25,2025 22:23

సదస్సులో మాట్లాడుతున్న అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి లలితా లక్ష్మీ హారిక కోట

                         హిందూపురం : లైంగిక వేధింపుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి లలితాలక్ష్మీ హారిక కోట సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బాల్యవివాహాల నిరోధంపై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో న్యాయమూర్తితో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ డి ఈ రమేష్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా మంచి స్పర్శ, చెడు స్పర్శలపై ఆడపిల్లలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఇలాంటి విషయాల్లో దాపరికాలు లేకుండా పిల్లలు తెలియజేసే విధంగా చూడాలన్నారు. అదే విధంగా రాజ్యాంగం నిర్దేశించిన వయసు మేరకే తల్లిదండ్రులు అమ్మాయిలకు వివాహం చేయాలన్నారు. అమ్మాయిలు సమాజంలో ఎదురవుతున్న సమస్యలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకువస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఆడిటింగ్‌ అధికారి శోభన్‌ రెడ్డి, న్యాయవాదులు రవిచంద్ర, మురళి, ఉదరు సింహారెడ్డి, ఈశ్వరప్ప, అనిల్‌ కుమార్‌, లోక్‌ అదాలత్‌ సిబ్బంది శారద, టిఎల్‌ఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి, నళినాక్షి, సిఒలు నాగేశ్వరి, పరంజ్యోతి, వరలక్ష్మి, గంగ రత్న, తౌసిఫ్‌ అలీ ఖాన్‌, ఇబ్రహీం ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️