రాప్తాడులో కందికుంటను పరిశీలిస్తున్న కరువు బృందం సభ్యులు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి
‘పంటకు కీలకమైన సమయంలో ఒకటిన్నర నెల పాటు తీవ్ర వర్షాభావం నెలకొంది. పంట మొత్తం నష్టపోయాం. పెట్టుబడులు కూడా చేతికందలేదు. పూర్తిగా నష్టపోయాం.. ఆదుకోండి.’ అంటూ కేంద్ర కరువు బృందానికి ఉమ్మడి జిల్లా రైతులు విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. 2024 ఖరీఫ్‌కు సంబంధించి నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర కరువు బృందం బుధవారం నాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించింది. రూరల్ డెవలప్‌మెంట్ అండర్ సెక్రటరీ జయంతి కనోజియా, ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ పొన్నుస్వామిలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరు మొదట సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లి గ్రామంలో పర్యటించారు. కంది, వేరుశనగ రైతులతో మాట్లాడారు. అనంతరం బత్తలపల్లి మండలం రాంపురం గ్రామం మీదుగా తాడిమర్రి మండలంలోని తాడిమర్రి గ్రామం వరకు పర్యటించారు. ఇక్కడ ఉలవ, జొన్న రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నాం నుంచి అనంతపురం జిల్లాలో కరువు బృందం పర్యటించింది. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామంలో మొదట కరువు బృందం పర్యటించింది. ఇక్కడ రైతు కొండప్ప పొలంలో పర్యటించి ఏ పంట వేశారు…ఏ మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఈ బృందం సేకరించింది. వేరుశనగ విత్తనం వేయగా ఒకటిన్నర నెల పాటు వర్షాభావం నెలకొందని కొండప్ప కరువు బృందానికి వివరించారు. దీని వల్ల దిగుబడి లేకుండా నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు. అనంతరం రాప్తాడు మండల కేంద్రంలో కరువు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో 2024లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను కలెక్టర్ వినోద్‌కుమార్ కరువు బృందం సభ్యులకు వివరించారు. అనంతరం రైతులతో ముఖాముఖి అయ్యారు. ఖరీఫ్‌లో కీలకమైన జులై, ఆగస్టు నెలలో తీవ్రమైన వర్షాభావం జిల్లాలో నెలకొందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి కరువు బృందానికి తెలియజేశారు. కరువు ప్రకటించిన ఏడు మండలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన వాతావరణం మూలంగా రైతులు నష్టపోయి ఉన్నారని చెప్పారు. అందరు రైతులను ఆదుకోవాలని కోరారు. సిపిఐ జిల్లా నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ వర్షాభావంతో చాల చోట్ల భూగర్భ జలాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. హంద్రీనీవాకు లైనింగ్ చేయవద్దని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లాకార్యదర్శి ఓ.నల్లప్ప రైతులను ఆదుకోవాలని కరువు బృందానికి వినతిపత్రం అందజేశారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కరువు బృందాన్ని కలసి రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.