ఎమ్మెల్యేను సన్మానిస్తున్న జర్నలిస్టులు
కదిరి టౌన్ : సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రూ. లక్ష విరాళం అందజేశారు. గురువారం ఉదయం కదిరి పట్టణంలోని తన నివాసంలో ఏపీయూడబ్ల్యూజే శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు సి. పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి డి. బాబు ఎమ్మెల్యేని కలిసి జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనారోగ్యం, ప్రమాదవశాత్తు జరిగే సంఘటనల నేపథ్యంలో బాధిత జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలన్న సంకల్పంతో ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో సహాయ నిధిని ఏర్పాటు చేసినట్లు యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్యేకి వివరించారు. తమ వంతుగా విరాళం అందించాలని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే కందికుంట రూ. లక్ష విరాళాన్ని ఏపీయూడబ్ల్యూజే నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిత్యం సమాజ చైతన్యం కోసం శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం సహాయ నిధిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ప్రసార, ప్రచార మాధ్యమాలు కేవలం సంచలన వార్తల కోసమే కాకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తలారి నరసింహులు, డాక్టర్ దండం చంద్రశేఖర్, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.