ఓటరు జాబితాలో అభ్యంతరాలను స్వీకరిస్తాం

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌

ఓటరు జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ముందుగానే ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, మార్పులు, చేర్పులు, తొలగింపు, ఓటర్ల సంఖ్య అనుగుణంగా నూతన పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు వంటి అంశాలపై చర్యలకు భారత ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. 29-11-24వ తేదీ నుండి 21-3-25 వరకు ఫారం-6 స్వీకరించబడిన దరఖాస్తులు 3676, ఫారం-7 నందు 1193 ఫారం-8లో 6938 దరఖాస్తుల స్వీకరించినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికి 14,12,177 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పురుషులు 7,01,586, స్రీలు 7,10,527, ట్రాన్స్‌ జెండర్లు 64 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 1576 మొత్తం పోలింగ్‌ స్టేషన్లో సంఖ్య ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఓటర్ల జాబితా, స్వచ్ఛకరణ, మార్పులు, చేర్పులు తొలగింపు, ఓటర్ల సంఖ్య అనుగుణంగా, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, ప్రతిపాదనల అంశాలపై చర్యలకు భారత ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు జాబితాపై తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో విజయ సారధి, కలెక్టరేట్‌ ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ జాకీర్‌ హుస్సేన్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️