యథేచ్ఛగా ‘ప్రయివేటు’ దోపిడీ

Jun 10,2024 21:40

మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యానర్‌

                 చిలమత్తూరు : విద్యాసంవత్సరం ప్రారంభం కాక మునుపే ప్రయివేటు విద్యాసంస్థల దోపిడీ ప్రారంభమైంది. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తూ వ్యాపారానికి తెరలేపుతున్నాయి. ఆకర్షణీయమైన బోర్డింగ్‌లు ఏర్పాటు చేసి లేనివి ఉన్నట్లు చెబుతూ పిల్లల తల్లిదండ్రులను మాయచేసి వేలాదిరూపాయలు దండుకుంటున్నాయి. ఇదంతా చూస్తూ విద్యాశాఖ అదికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చిలమత్తూరు మండల కేంద్రంలో దేవరాయ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేయడంలో అగ్రగామిగా ఉందని చెప్పవచ్చు. అయితే ఆ స్కూల్‌ కి కేవలం 7 వ తరగతి వరకు అనుమతి ఉండగా 10 వ తరగతి వరకు తమకు అనుమతి ఉందని బోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటోంది. దీనికి తోడు ఐఐటి పౌండేషన్‌, ఎపిఆర్‌ఎస్‌, నవోదయ శిక్షణ ఉంటుందని ప్రచారం చేస్తోంది. అలాగే కేరళా టీచర్లతో శిక్షణ అంటూ తల్లిదండ్రులను బహిరంగంగానే ఆకర్షిస్తున్న పరిస్థితి నెల్గొంది. ఇది ఇలా ఉండగా ప్రయివేటు పాఠశాలలకు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు కాని విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి హస్టల్‌ను నిర్వహిస్తున్నారు. అలాగే బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నా కట్టడి చేయల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుంది. విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో ప్రయివేటు స్కూళ్ల దోపిదీకి విద్యాశాఖ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా నోట్‌బుక్‌ల నుండి పాఠ్యాంశ పుస్తకాల దాక అన్ని తమ వద్దే కొనాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసే పుస్తకాలు కాకుండా ప్రయివేటు సంస్థలు ఎలాంటి ప్రమాణాలు లేని పుస్తకాలను నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. ఇప్పటికైన విద్యాశాఖ అదికారులు స్పందించి ఇలాంటి ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులు దోపిడీకి గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️