శ్రీకాకుళం, వెస్ట్‌ గోదావరి, విశాఖపట్నం జట్లు విజయం

ప్రజాశక్తి – కడప ఎసిఎ అండర్‌ – 19 గ్రూప్‌ బి అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌లో తొలి రౌండు మ్యాచ్‌లలో నెల్లూరు జట్టుపై 19 పరుగుల తేడాతో శ్రీకాకుళం జట్టు విజయం సాధించింది. కడప జట్టుపై 4 వికెట్ల తేడాతో వెస్ట్‌ గోదావరి జట్టు విజయం సాధించింది. వేరొక మ్యాచ్‌ లో చిత్తూరు జట్టుపై 7 వికెట్ల తేడాతో విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. కెఒఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టుపై ఇన్నింగ్స్‌ 19 పరుగుల తేడాతో శ్రీకాకుళం జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌ లో మొదటి ఇన్నింగ్స్‌లో నెల్లూరు జట్టు 119 పరుగులు చేసింది. శ్రీకాకుళం జట్టు మొదటి ఇన్నింగ్స్‌ లో 407 పరుగులు చేసింది. 6 వికెట్ల నష్టానికి 220 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 58.5 ఓవర్లలో 269 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని అర్జున్‌ 75, కారుణ్య ప్రసాద్‌ 43 పరుగులు చేశారు. శ్రీకాకుళం జట్టులోని జున్నారావు అద్భుతంగా బౌలింగ్‌ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. సిద్దు విగేష్‌ 2 వికెట్లు తీసుకున్నాడు. వైఎస్‌ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో నిర్వహించిన మ్యాచ్‌లో కడప జట్టుపై 4 వికెట్ల తేడాతో వెస్ట్‌ గోదావరి జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో కడప జట్టు 215 పరుగులు చేసింది. వెస్ట్‌ గోదావరి జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 9 టికెట్లు నష్టానికి 306 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో చివరి రోజు బ్యాటింగ్‌ ప్రారంభించి 119 ఓవర్లలో 317 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని ప్రణీత్‌ పవన్‌ 92 పరుగులు చేశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కడప జట్టు 61.2 ఓవర్లలో 177 పరుగులు చేసి అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని ప్రణవ్‌ రెడ్డి 40, గురు చరణ్‌ 36 పరుగులు చేశారు. వెస్ట్‌ గోదావరి జట్టులోని మెహబూబ్‌ 3, సాయిర్‌ 3 వికెట్లు తీసుకున్నారు. దీంతో 76 పరుగుల విజయ లక్ష్యాన్ని కడప జట్టు వెస్ట్‌ గోదావరి జట్టు ముందు ఉంచింది. అనంతరం 76 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్ట్‌ గోదావరి జట్టు 20.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసి 4 తేడాతో విజయం సాధించింది. కడప జట్టులోని ధీరజ్‌ కుమార్‌ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు. కెఆర్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో చిత్తూరు జట్టుపై 7 వికెట్ల తేడాతో విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌ లో చిత్తూరు జట్టు 286 పరుగులు చేసింది. విశాఖపట్నం జట్టు మొదటి ఇన్నింగ్స్‌ లో 391 పరుగులు చేసింది. 2 వికెట్ల నష్టానికి 65 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో చివరి రోజు రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 77.5 ఓవర్లలో 330 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని లోహిత్‌ లక్ష్మీనారాయణ 128 పరుగులు (నాటౌట్‌), వరుణ్‌ 56 పరుగులు చేశారు. విశాఖపట్నం జట్టులోని పి.డి. రచిత్‌ అద్భుతంగా బౌలింగ్‌ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విశాఖపట్నం జట్టు 26.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులోని హతిక్‌ వర్మ 113 పరుగులు చేశాడు.

➡️