అక్రమ రవాణాపై పటిష్ట నిఘా

సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం, లావేరు

సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక అన్నారు. అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌ పరిధిలోని హెడ్‌ కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ వరకు గల అధికారులకు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఎన్నికల విధులు, నియమావళిపై మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఎన్నికల ముందు, తర్వాత అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం విధులు నిర్వహించడంపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించి పరిస్థితులపై అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. గత ఎన్నికల్లో కేసులను పరిగణలోకి తీసుకొని పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. మద్యం, నగదు అక్రమ రవాణాపై దృష్టి కేంద్రీకరించి, స్వాధీనంలో నిబంధనల మేరకు జాగ్రతలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డిఎస్‌పి వై.శృతి, డిపిటిసి డిఎస్‌పి విజరు కుమార్‌, శ్రీకాకుళం రూరల్‌ సిఐ ఎల్‌.సన్యాసినాయడు, డిపిటిసి నిర్మల తదితరులు పాల్గొన్నారు.పుస్తక పఠనంతో విజ్ఞానంపుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక అన్నారు. లావేరు మండలంలోని బుడుమూరులో బుడుమూరు యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గ్రంథాలయం (బుడుమూరు విజ్ఞాన కేంద్రం)ను ఎస్‌పి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక వంటి వారని చెప్పారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి ఇదో మంచి అవకాశమని చెప్పారు. యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మంచి విజ్ఞానాన్ని సంపాదించి మన దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

➡️