అప్రెంటిస్‌ విధానం వద్దు

ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్‌

నోటిఫికేషన్‌ ప్రతులను దగ్ధం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

  • యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిఎస్‌సి నోటిఫికేషన్‌లో అప్రెంటిస్‌ విధానాన్ని పొందుపరచడాన్ని నిరసిస్తూ నగరంలోని డే నైట్‌ కూడలి వద్ద నోటిఫికేషన్‌ ప్రతులను యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు సోమవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు సంస్కరణల్లో భాగంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. 1994 నుంచి పెద్దఎత్తున పోరాటాలు చేసి 2012లో రద్దు చేసుకోగలిగామని గుర్తుచేశారు. మళ్లీ అదే విధానాన్ని తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తిరిగి వెట్టిచాకిరీ విధానాన్ని జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర మాట్లాడుతూ మెగా డిఎస్‌సి అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడమే కాకుండా నియామకం పొందిన ఉపాధ్యాయులను మళ్లీ అప్రెంటిస్‌ విధానంలోకి నెట్టడం తీవ్రమైన చర్య అన్నారు. దీనికి ప్రభుత్వం కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.సూర్యప్రకాశరావు, జి.సురేష్‌, జిల్లా నాయకులు పి.బాబూరావు, కె.సరేష్‌ కుమార్‌, పి.చిన్నారావు పాల్గొన్నారు.

➡️