అభివృద్ధిపై శ్వేతపత్రానికి సిద్ధమా?

శ్రీకాకుళం నియోజకవర్గానికి

లోకేష్‌కు నాగలిని బహుకరించిన టిడిపి నాయకులు

  • బహిరంగ చర్చకు టైమ్‌, డేట్‌ చెప్పాలని సవాల్‌
  • ఇసుక దోపిడీ తప్ప ధర్మాన చేసిందేమీ లేదు
  • ఐటి పరిశ్రమ ఇచ్చిన భూమి కేటాయించలేదు
  • టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పోలాకి, ఆమదాలవలస

శ్రీకాకుళం నియోజకవర్గానికి తామేం చేశామో శ్వేతపత్రం విడుదల చేస్తామని, ఇందుకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శంఖారావం యాత్రలో భాగంగా రెండో రోజు సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుని ఇసుక దోపిడీ తప్ప నియోజకవర్గానికి చేసిందేమిటని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిపై తేదీ, సమయం చెప్తే తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మంత్రిగా ఉండి ధర్మాన కనీసం రోడ్లను పూడ్చలేకపోయారని విమర్శించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలంలో సావిత్రిపురం దగ్గర 23 ఎకరాలను మంత్రి ధర్మాన, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో సెజ్‌ను ఏర్పాటు చేసి జిల్లాకు పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగావకాశాలను కల్పిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో ఐటి పరిశ్రమ ఇచ్చినా పరిశ్రమల శాఖ ప్రభుత్వం భూమి కేటాయించలేదన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని, ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేయాలనే ఆలోచన తప్ప ఏనాడూ నియోజకవర్గం గురించి ఆలోచించలేదన్నారు. అధికారంలోకి వస్తే బొంతు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. శ్రీముఖలింగం ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా తానే తీసుకుంటానన్నారు. పాదయాత్రలో ఆమదాలవలసలో షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీనిచ్చి నేటికీ తెరిపించలేదని విమర్శించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండాలని, కానీ ఇక్కడ సొంత ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు. ల్యాండ్‌, సాండ్‌ మాఫియాకు అడ్డాగా ఆమదాలవలసను మార్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి, భూముల ఆక్రమణపై విచారణ వేసి వడ్డీతో చెల్లించి ప్రజలకు అప్పగిస్తామన్నారు. వంశధార నదిపై పురుషోత్తపురం వద్ద, నాగావళి నదిపై దూసి వద్ద వంతెలను నిర్మిస్తామని హామీనిచ్చారు. ఆమదాలవలసలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు ప్రవీణ్‌కుమార్‌, కోరాడ సర్వేశ్వరరావు, పేడాడ రామ్మోహన్‌ పాల్గొన్నారు.రోడ్డు వేసుకోలేకపోయారు : ఎంపీతమ్మినేని సీతారాంను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇసుక దందా, దోపిడీ కోసమే పదవులను ఉపయోగించుకున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. మంత్రి, స్పీకర్‌గా ఉన్న వ్యక్తులు శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డును వేసుకోలేకపోయారని విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో ఐదేళ్లు అవుతున్నా స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేయకుండా గాలికొదిలేశారని విమర్శించారు.గత పనులూ పూర్తి చేయలేకపోయారుటిడిపి హయంలో నిర్మించిన వంతెనలకు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ రిబ్బన్లు కట్‌ చేస్తున్నారని నరసన్నపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి బగ్గు రమణమూర్తి విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో ప్రారంభించిన పనులనూ పూర్తి చేయలేకపోయారని చెప్పారు.శ్రీకాకుళం నియోజకవర్గంలో 1,238 టిడ్కో ఇళ్లను నిరర్థకంగా మార్చారని శ్రీకాకుళం నియోజ కవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి విమర్శించారు. కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని 80 శాతం పూర్తి చేసినా మిగిలిన 20 శాతం ధర్మాన ప్రసాదరావు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.కమీషన్లు ఇవ్వకపోతే పనులు రద్దుటిడిపి హయాంలో రోడ్ల కోసం మంజూరు చేసిన నిధులను వినియోగించుకోలేని అసమర్థుడు తమ్మినేని సీతారాం అని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. మంచినీటి పథకం కోసం గత టిడిపి ప్రభుత్వం రూ.276 కోట్లు మంజూరు చేస్తే కమీషన్ల కోసం వాటిని రద్దు చేశారని విమర్శించారు.లోకేష్‌కు పలువురు వినతులుసిపిఎస్‌తో పాటు మోసపూరిత జిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయాలని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన న్యాయవాదులు వినతిపత్రం ఇచ్చారు. ఇస్లాం బ్యాంకు ద్వారా మైనార్టీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు కోరారు. గోపాలమిత్ర పథకాన్ని పునరుద్ధరించి గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సంఘ ప్రతినిధులు కోరారు. కళింగ కోమటి, సొండి సామాజిక తరగతులను ఒబిసిలో జాబితాలో చేర్చాలని ఆయా సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తామంతా రోడ్డున పడ్డామని, తమ సేవలను వినియోగించుకోవాలంటూ మీసేవ నిర్వాహకులు విన్నవించుకున్నారు.

➡️