అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి జర్నలిస్ట్‌ హౌసింగ్‌ స్కీమ్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 535 జిఒలోని అన్ని నిబంధనలను పాటించి అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అర్హత ఉన్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్స్‌, వెటరన్‌ పాత్రికేయులకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరిచిన అర్హతలు, నిబంధనల ప్రకారం దరఖాస్తులు పూర్తి చేసిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ఐదేళ్ల అక్రిడేషన్‌ అనుభవం కలిగిన వారిని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ గుర్తించి పంపిన ప్రాథమిక జాబితాను పరిశీలించిన అనంతరం తుది జాబితా మేరకు స్థలాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రాథమిక పరిశీలన తర్వాత జిల్లాకు 326 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిని ఆర్‌డిఒ, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాలకు పంపించి పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. ఇళ్లస్థలాలు కేటాయించేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలని ఆర్‌డిఒలను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, పలాస ఆర్‌డిఒ కార్యాలయ ప్రతినిధి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య కమిటీ సభ్యులు ఎస్‌.జోగినాయుడు, వి.సన్యాసినాయుడు, డిఐపిఆర్‌ఒ కె.చెన్నకేశవరావు, డిపిఆర్‌ఒ కె.బాలమాన్‌సింగ్‌, డివిజనల్‌ పిఆర్‌ఒ రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️