ఉపాధి కల్పించకపోతే ఉద్యమం తప్పదు

సంతబొమ్మాళి మండలం మూలపేట

విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి నాయకులు

  • ప్రభుత్వానికి వైసిపి నాయకుల హెచ్చరిక

ప్రజాశక్తి – నౌపడ

సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఉద్యమం తప్పదని స్థానిక వైసిపి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భావనపాడులో సర్పంచ్‌ బి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులతో పాటు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు, స్థానిక నాయకులకు పోర్టు పనుల్లో ప్రాధాన్యత కల్పించకుండా స్థానికేతరులకు ఉపాధి కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై మండిపడ్డారు. వారం రోజుల్లోగా తమకు తగిన ప్రాధాన్యత కల్పించుకుంటే రిలే దీక్షలు చేపట్టడంతో పాటు తదుపరి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనబోమని స్పష్టం చేశారు. సమావేశంలో వైసిపి మండల అధ్యక్షుడు, మూలపేట సర్పంచ్‌ జీరు బాబూరావు, లక్కివలస సర్పంచ్‌ వీరాస్వామి, కో ఆప్షన్‌ సభ్యులు హన్నూరావు, నౌపడ- 2 ఎంపిటిసి సుధాకర్‌, ఎఎంసి చైర్మన్‌ తనయుడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️