‘ఎలుగు’ బందీ

అటవీశాఖ అధికారులు చేపట్టిన

ఎలుగు బోనులో చిక్కగానే చేరిన స్థానికులు

  • ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌ ఎలుగు బంధి విజయవంతమైంది. 50 మంది రెస్క్యూ బృందం 12 గంటలు పాటు శ్రమించారు. స్థానికులు, పోలీసులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారు. సోమవారం రాత్రి రెండున్నర గంటల సమయంలో మండలంలోని మెట్టూరులో ఎలుగు ప్రవేశించి ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడింది. దీనిని గ్రామానికి చెందిన కొమర దమయంతి, గండుపల్లి మోహన్‌ చూశారు. ఆ సమయంలో కుక్కలు బిగ్గరగా అరవడంతో పక్కింట్లో ఉన్న తాను మేల్కొని బయటకి వచ్చి చూడగా… ఎలుగు పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించిందని దమయంతి తెలిపారు. ఈ విషయం ఉదయం ఐదు గంటలకు గ్రామస్తులకు తెలియజేశారు. వెంటనే గ్రామ పెద్దలు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన అర గంటలో ఫారెస్టు అధికారులు ఎలుగు ఉండే స్థలానికి చేరుకున్నారు. మరో అరగంట తరువాత స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులు, అటవీ శాఖ, పోలీసులు పాడుబడిన ఇంట్లో ఎలుగు ఉన్నదని నిర్ధారించుకున్నారు. ఎలుగు బయటకు రాకుండా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఇనుప చట్రాలను అడ్డుగా ఉంచారు. ఇంటిముందు రాకపోకలు నిషేధించి రోడ్డుకు అడ్డంగా పెద్ద వలలను ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటలకు జిల్లా అటవీ శాఖ అధికారి నిషాకుమారి అక్కడకు చేరుకున్నారు. ఆమె అధికారులను సమన్వయం చేస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం విశాఖపట్నం జూ నుంచి వన్యప్రాణులను మత్తు ఇచ్చే వైద్యులు పురుషోత్తంతో పాటు జూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి నేతృత్వంలో రెస్క్యూ బృందం మధ్యాహ్నం 2 గంటలకు ఎలుగును బంధించడానికి ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. టార్చిలైట్లతో ఇంట్లోకి వెళ్లి ఎలుగు పరిస్థితిని సిబ్బంది దూరం నుంచి గమనించే ప్రయత్నం చేశారు. తేనె కలిపిన జీడి పళ్లను ఇంట్లోపల పెట్టారు. అయినా ఎలుగు స్పందించలేదు. తరువాత విశాఖపట్నం నుంచి తీసుకొచ్చిన బోనును లోపలపెట్టి అందులో జీడి పళ్లు పెట్టారు. అప్పటకీ ఎలుగు స్పందింలేదు. అనంతరం పెద్ద కర్రలను తీసుకొచ్చి బోను మధ్య గుండా ఎలుగు దగ్గరకు పోనిచ్చారు. అయినా ఎలుగు కదలకలేదు. కొండపల్లి యువకులు సాయంతో ఇంటిపై భాగంలోని రేకులపై రాళ్లతో, కర్రలతో బాదుతూ పెద్ద శబ్ధం చేశారు. దీంతో ఎలుగు భయపడి ఒక్కసారిగా బోనులోకి వచ్చి పడింది. దీంతో నాలుగు గంటల 15 నిముషాలకు ఆపరేషన్‌ పూర్తయ్యింది. అనంతరం వ్యాన్‌పై విశాఖపట్నం జూకు తరలించారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్‌ మురళీకృష్ణంనాయుడు, ఎస్‌ఐ రామారావు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️