ఏది ‘జలకళ’

Apr 1,2024 22:37 #ఏది 'జలకళ'
చిన్న సన్నకారు రైతులకు మేలు

కోటబొమ్మాళి మండలం ఊడికలపాడులో ట్రాన్స్‌ఫార్మర్‌ వేసి కనెక్షన్‌ ఇవ్వని అధికారులు (ఫైల్‌)

  • బోర్ల తవ్వకాలకు 5,714 మంది దరఖాస్తు
  • ఇప్పటివరకు 154 మందికే మంజూరు
  • చాలాచోట్ల బోర్లు తవ్వేసి కనెక్షన్లు ఇవ్వని వైనం
  • మూడున్నరేళ్లుగా నిరీక్షణే

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావొస్తున్నా నేటికీ ఉచిత బోర్లకు దిక్కులేకుండా పోయింది. జిల్లాలో సాగునీటి సౌకర్యం లేని భూముల్లో ఉచితంగా బోర్లు వేసి వాటిని వినియోగంలో తీసుకొస్తామంటూ వైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కిందట వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. బోర్లతో పాటు విద్యుత్‌ కనెక్షనూ అందిస్తామని చెప్పడంతో రైతులు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. బోర్ల తవ్వకాలకు అధిక బడ్జెట్‌ వెచ్చించాల్సి రావడంతో దరఖాస్తులకు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. పథకాన్ని ఆపేశారా? లేక ఇస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

చిన్న సన్నకారు రైతులకు మేలు కలిగించేందుకు వైసిపి ప్రభుత్వం సెప్టెంబరు 28, 2020లో ప్రారంభించింది. బోరు సౌకర్యం లేని 2.5 ఎకరాలు నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులను అర్హులుగా పేర్కొంది. బోర్ల తవ్వకం, విద్యుత్‌ కనెక్షన్లను ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం అందులో మార్పులు చేయడంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. ఐదెకరాల్లోపు వారికి సైతం రూ.2 లక్షలోపు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్ల ఖర్చు చేస్తామని, అంతకంటే ఎక్కువ అయితే రైతులే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. అయినా రైతులు ఖర్చుకు వెనుకాడకుండా బోర్లు తవ్వించుకోవడానికి సిద్ధపడ్డారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కోసం మొత్తం 5,714 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4,690 దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. వాటిలో 2,299 చోట్ల సర్వే పూర్తి చేశారు.154 మందికే బోర్లు మంజూరుబోర్ల కోసం జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నా 154 మందికే అప్రూవల్‌ ఇచ్చారు. వీరిలో ఆరుగురు రైతులు ఇప్పటికే రూ.19.82 లక్షలు చెల్లించారు. ఇంకా 148 మంది రూ.5.31 కోట్లను చెల్లించాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం డివిజన్‌లో 59, పలాస డివిజన్‌లో 24, టెక్కలి డివిజన్‌లో 71 మందికి బోర్లు మంజూరయ్యే అవకాశం ఉంది. బోర్లు తవ్వినా విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వని వైనంసాధారణంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్‌, నాలుగు విద్యుత్‌ స్తంభాలు వేస్తే రూ.2 లక్షల అంచనా వ్యయం దాటిపోతుంది. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది ఒకటి నుంచి రెండు కి.మీ. మేర స్తంభాలు వేయాల్సిన వారు ఉన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌తో కలిపితే వారికి రూ.5 నుంచి రూ.6 లక్షలు దాటిపోతోంది. ప్రభుత్వం కనీసం రెండు లక్షలు ఇచ్చినా మిగిలిన ఖర్చు భరించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.2 లక్షల వరకు విద్యుత్‌ కనెక్షన్‌ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా ఆ తర్వాత ఎవరికీ డబ్బులు చెల్లించలేదు. ఎక్కడా ఒక్క కనెక్షన్‌ ఇవ్వలేదు. కొన్ని చోట్ల విద్యుత్‌శాఖ కనెక్షన్లు ఇచ్చినా వాటికైనా ఖర్చునూ ప్రభుత్వం చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం విద్యుత్‌శాఖకు డబ్బులు ఇవ్వకపోవడంతో కనెక్షన్లను ఆపేసింది. దీంతో బోర్లు తవ్వి విడిచిపెట్టేయంతో మట్టి కూరుకుపోతోందని, తమకూ బోర్లు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

➡️