కౌంటింగ్‌ కేంద్రాలు పరిశీలన

ఎచ్చెర్లసాధారణ ఎన్నికలు 2024కు ఎచ్చెర్ల మండలంలోని శివాని

పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

సాధారణ ఎన్నికలు 2024కు ఎచ్చెర్ల మండలంలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక మంగళవారం పరిశీలించారు. ఇవిఎంలు, ఇతర అనుబంధ యూనిట్లు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, 24 గంటలు కాస్టింగ్‌ జరిగేలా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆదేశించారు. ముందుస్తు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సులువుగా వాహనాలు చేరుకునేలా నిర్మిస్తు న్న రహదారి పనులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత కట్టుదిట్టమైన భద్రత మధ్య శివాని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు తీసుకొని వస్తారని, రిసప్షన్‌ కేంద్రం వద్ద ఇవిఎంలను స్వీకరించి, ఒక నిర్ధిష్టమైన రూట్‌లో ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా బ్యాలెట్‌ యూనిట్లను రిసెప్షన్‌ కేంద్రం నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు తీసుకొచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌ కలర్‌ కోడ్‌ ఇవ్వాలని సూచించారు. ఎస్‌పి పోలీసు బందోబస్తు పరంగా అన్ని విధాల భద్రతా చర్యలు తీసుకోవడం, కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్‌ లేకుండా, సులువుగా చేరుకునేలా జిల్లా ఎన్నికల అధికారితో సమన్వయం చేసుకోవడం లాంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో జెసి ఎం.నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, శ్రీకాకుళం ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌సుధాకర్‌, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️