జిల్లాకు ఐటిడిఎ తీసుకొస్తా

ఐటిడిఎ లేని జిల్లాగా

అభివాదం చేస్తున్న లోకేష్‌

  • నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం
  • శంఖారావం సభలో లోకేష్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, మెళియాపుట్టి

ఐటిడిఎ లేని జిల్లాగా ఉన్న శ్రీకాకుళానికి దాన్ని తీసుకొచ్చే బాధ్యత తనదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. పాతపట్నంలో మంగళవారం నిర్వహించిన శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. వంశధార నిర్వాసితులకు భూసేకరణ చట్టం అమలు చేస్తామని హామీనిచ్చి జగన్‌ మోసం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టిడిపి హయాంలో ఐదు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లు ప్రారంభిస్తే, ఇప్పుడు వాటిని ఆపేశారని విమర్శించారు. పాతపట్నం ప్రజలు రెడ్డి శాంతిని ఎమ్మెల్యేగా గెలిపించినా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. నియోజకవర్గానికి ఎవరేం చేశారో చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే ఇసుక దోపిడీ, పాఠశాల స్థలాన్ని ఆక్రమించి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులనూ రెడ్డి శాంతి అమ్ముకుంటున్నారని చెప్పారు. పాతపట్నంకు పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు మొదటి రెండేళ్లలో పెండింగ్‌ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. అనంతపురం జిల్లాకు కియా మాదిరిగా శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పారు. టిడిపి-జనసేన మధ్యలో చిచ్చుపెట్టేందుకు వైసిపి పేటిఎం బ్యాచ్‌ ప్రయత్నిస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జిల్లా నుంచి వలస వెళ్లే వారిలో అత్యధికులు పాతపట్నం నియోజకవర్గం వారే ఉంటున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని లోకేష్‌ను కోరారు. వైసిపిని నమ్మి ఓట్లేసిన గిరిజనులను జగన్మోహన్‌రెడ్డి నిండా ముంచారని విమర్శించారు. పాతపట్నం రైల్వేస్టేషన్‌లో సమస్యలను కొన్నింటిని పరిష్కరించామని, రైల్వే మంత్రితో మాట్లాడి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.వంశధార నిర్వాసితులకు మోసంవంశధార నిర్వాసితులను ప్రభుత్వం అన్నిరకాలుగా మోసం చేసిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామని హామీనిచ్చి గాలికొదిలేశారని చెప్పారు. వైసిపి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైఖరితో ప్రజలు విసిగివేశారని విమర్శించారు. సభలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, టిడిపి, జనసేన జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, పిసిని చంద్రమోహన్‌, టిడిపి నాయకులు మామిడి గోవిందరావు, జనసేన పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గేదెల చైతన్య తదితరులు పాల్గొన్నారు.లోకేష్‌కు వినతులుఅధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రకటించి భర్తీ చేయాలని పలువురు నిరుద్యోగులు లోకేష్‌ను కోరారు. మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలని ఆర్‌జియుకెటి కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ విన్నవించారు. సిపిఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్‌ చేసి, పెన్షన్‌, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

➡️