‘జెమ్స్‌’కు అరుదైన గుర్తింపు

శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా ఉన్న రాగోలులోని జెమ్స్‌

గుర్తింపు పత్రాన్ని స్వీకరిస్తున్న భాస్కరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌

శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా ఉన్న రాగోలులోని జెమ్స్‌ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. శస్త్ర చికిత్స వైద్య కళాశాలల్లో రెండు శతాబ్ధాల చరిత్ర కలిగి, ప్రపంచంలోనే పేరొందిన లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కళాశాల నుంచి అక్రిడిటేషన్‌ లభించింది. వైద్య రంగంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జెమ్స్‌ కళాశాల భారత దేశంలో ఈ గుర్తింపు పొందిన తొలి కళాశాలగా జెమ్స్‌ నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జెమ్స్‌ యాజమాన్యాన్ని అంకాలజిస్ట్‌, పద్మశ్రీ డాక్టర్‌ రఘురాం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల చీఫ్‌ మెంటార్‌ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ తమ కళాశాలకు ఈ గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. గతేడాది రాయల్‌ కాలేజీ అఫ్‌ సర్జన్స్‌ బృందం తమ కళాశాలను సందర్శించి, ఇక్కడ బోధన, వైద్య అభ్యసనా పద్ధతులు, సదుపాయాలు, ఆపరేషన్‌ థియేటర్లు తదితరాలు పరిశీలించి తమకు ఈ గుర్తింపును ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో జెమ్స్‌ సిఇఒ బొల్లినేని అద్విక్‌, సిఎఒ ఎస్‌.రామ్మోహన్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీలలిత, మెడికల్‌ సూపరింటెండెంట్లు డాక్టర్‌ అశోక్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీనివాసులు, జనరల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ కనుగుల సుధీర్‌ పాల్గొన్నారు.

 

➡️