టిడిపి-జనసేన కూటమిదే విజయం

టిడిపి, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని జనసేన పార్టీ

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న చంద్రమోహన్‌

జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ టిడిపి, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌ అన్నారు. నగరంలోని సూర్యమహల్‌ థియేటర్‌ వెనుక కాలనీలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం పెదపాడు రోడ్డులోని జనసేన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారతదేశ రాజకీయాల్లోనే నూతన ఒరవడిని తెచ్చిన పవన్‌కళ్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు. వైసిపి ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌ రాష్ట్రానికి ఈత కాయ ఇచ్చి… తాటికాయ లాక్కున్న మాదిరిగా ఉందన్నారు. ఇటీవల జనసేన పార్టీ అధిష్టానం ఓ చారిత్రక నిర్ణయం తీసుకుందని, జనసేన పార్టీలో వీర మహిళలకు, జన సైనికులకు ఎవరికైనా ప్రమాదాలు జరిగితే వారికి ఆర్థికసహాయాన్ని చేస్తున్నట్టు వివరించారు. అందులో భాగంగానే ఇటీవల ప్రమాదంలో గాయపడిన గార మండలం లింగాలవలసకు చెందిన కోండ్రు లక్ష్మీనారాయణ యాదవ్‌కు రూ.2.50 లక్షల చెక్కును అందజేశారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు పేడాడ రామ్మోహనరావు, గేదెల చైతన్య, ఎన్ని రాజు, నిమ్మల నిభ్రం, కణితి కిరణ్‌, దాసరి రాజు, కోరాడ సర్వేశ్వరరావు, డాక్టర్‌ దుర్గారావు, విశ్వక్‌ సేన్‌, ప్రవీణ్‌, భూపతి అర్జునరావు, పాత్రుని పాపారావు, గర్భాన సత్తిబాబు, బాడాన జనార్థనరావు, పాండ్రంకి రాజేష్‌, కూరాకుల యాదవ్‌ పాల్గొన్నారు.

 

➡️