టిడిపి శవయాత్రలో

ఉత్తరాంధ్ర నుంచి శంఖారావం

కుళాయిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కృష్ణదాస్‌

  • కేష్‌ నోరు విప్పితే అబద్దాలే
  • వైసిపి జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్‌ ధ్వజం

ప్రజాశక్తి – నరసన్నపేట

ఉత్తరాంధ్ర నుంచి శంఖారావం పేరుతో నారా లోకేష్‌ చేస్తున్న యాత్ర టిడిపి శవయాత్ర అని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ఏదో యాత్ర పేరుతో జిల్లాకు వచ్చిన లోకేష్‌ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. లోకేష్‌ నోరు విప్పితే అన్నీ అబద్దాలే అన్నారు. తనకు తాను సచ్ఛీలునిగా, నిప్పుగా అభివర్ణించుకుంటున్నాడని… అతడు నిప్పుడు కాదు ఇనుముకు పట్టే తుప్పు అని దుయ్యబట్టారు. లోకేష్‌కు మేనిఫెస్టో అంటే తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే దాని గురించి మర్చిపోయే వారికి, అదే మేనిఫెస్టోను దైవంలా భావించి 99 శాతం హామీలు నెరవేర్చిన తమకు ఎంతో తేడా ఉందన్నారు. వీధి వీధికి బెల్టుషాపులు పెట్టి ఒళ్లు గుల్ల చేసింది మీరు కాదా అని నిలదీశారు. వైసిపి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌, డిజిటల్‌ లైబ్రరీ ఇలా నిర్మాణాలతో వారి కళ్లు బైర్లు కమ్మాయన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఓడిపోతామని తెలిసి ఎలాగూ ఇచ్చేది లేదనితండ్రీ కొడుకులు నోటికి ఏది పడితే అది వాగ్దానాలు చేస్తున్నారని చెప్పారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అంటే ఓటు బ్యాంకుగా చూశారే తప్ప ఒక్క పోర్టు గానీ, మంచినీటి పథకం గానీ, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ గానీ వంశధార గానీ, రిమ్స్‌ ఆస్పత్రి గానీ ఏదైనా చేయగలిగారా అని ప్రశ్నించారు. ఒక బిసిని డిప్యూటీ సిఎం చేయగలిగిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. బిసిలను వాడుకుని వదిలేసిన ఘనత తండ్రీ కొడుకులది అని అన్నారు.

➡️