నులిపురుగులతో రక్తహీనత

పిల్లల్లో రక్తహీనతకు నులిపురుగులు కారణమని, వాటి నివారణకు ఆల్బెండాజోల్‌ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ

మాత్రలు మింగిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పిల్లల్లో రక్తహీనతకు నులిపురుగులు కారణమని, వాటి నివారణకు ఆల్బెండాజోల్‌ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిన్నారులకు మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 నుంచి 19 ఏళ్ల మధ్య గల వారు ఈ మాత్రలు వేసుకోవాలన్నారు. ఇవి వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఎవరికైనా సమస్య తలెత్తినట్లు అనిపిస్తే వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లాలో 4.64 లక్షల మంది పిల్లలు ఉన్నారని, వారందరూ ఈ మాత్రలు వేసుకోవాలన్నారు. నులిపురుగులు సోకిన పిల్లలు, కిశోర బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వీటివల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తరచూ ఎదురవుతుంటాయన్నారు. నులిపురుగుల నిర్ములనా మాత్రలు వేసుకోని వారు ఈనెల 16న మాప్‌ అప్‌ డే రోజున వేసుకోవాలన్నారు. రానున్న వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, అందువల్ల తరచూ మంచినీరు తాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, జిల్లా కోర్డినేటర్‌ డాక్టర్‌ సి.పి శ్రీదేవి, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఉప విద్యాశాఖాధికారి ఆర్‌.విజయకుమారి, పట్టణ వైద్యులు రమ్య తదితరులు పాల్గొన్నారు.

 

➡️