నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు-2024

మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలిస్తున్న డిఇఒ వెంకటేశ్వరరావు

  • జిల్లాకు చేరుకున్న 1.85 లక్షల జవాబుపత్రాలు
  • డిఇఒ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు-2024 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైందని డిఇఒ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్‌ ఒకటి నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనిమిది రోజుల్లో స్పాట్‌ పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైందన్నారు. తాగునీరు, ఫర్నీచర్‌, లైటింగ్‌, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తం 7 పేపర్లకు సంబంధించి 24 పేజీల బుక్‌లెట్లతో కూడిన రెండు లక్షల పేపర్లు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. కోడింగ్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోందన్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఒరియా మీడియం జవాబుపత్రాలు దిద్దుబాటు జరగనుందని తెలిపారు. నగరంలో అందుకు వసరమైన సిబ్బందిని నియమించాం. విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు, కలెక్టర్‌ సూచనల మేరకు అధికారులు, ఎగ్జామినర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, చైతన్య పాఠశాలల్లో మూల్యంకనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.కొద్ది రోజుల్లోనే…మార్చి 18 నుంచి 28 వరకు పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే వెంటనే మూల్యాంకనం చేపట్టడం విశేషం. తెలుగు, సాంఘీకశాస్త్రం, జీవశాస్త్రం సబ్జక్టులకు బాలికోన్నత పాఠశాల కేంద్రం కేటాయించారు. హిందీ, ఆంగ్లం, భౌతిక రసాయనిక శాస్త్రం, గణితం సజ్జెక్టులకు చైతన్య పాఠశాల కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇందు కోసం సిఇఎఇ స్పెషల్‌ అసిస్టెంట్ల నియామకానికి సుమారు 12 వందల మంది ఉపాధ్యాయులను నియమించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టే ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా కావాల్సిన మౌలిక సదుపాయాలనూ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం చేపట్టే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. మూల్యాంకనం చేపట్టే ఉపాధ్యాయులు సెల్‌పోన్లు వినియోగించకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు. మూల్యాంకనం అనంతరం ఏప్రిట్‌ మూడో వారంలోనే ఫలితాలు వెలువడే ఆవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

➡️