‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా నుంచి 30,574 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 7 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 145 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా ఆర్‌టిసి బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. జిల్లా విద్యా శాఖ సహాయ కమిషనర్‌ లియాఖత్‌ అలీఖాన్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

➡️