పోస్టల్‌ బ్యాలెట్‌కు యంత్రాంగం కసరత్తు

జిల్లాలో జరగనున్న సార్వత్రిక
  • పెరిగిన సంఖ్యకు తగ్గట్టు ఏర్పాట్లు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌ను కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి, సరిహద్దు రక్షణ దళాల్లో పని చేసేవారికి మాత్రమే ఈ సౌకర్యాం ఉండేంది. కానీ, ఈసారి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని వెసులబాట్లు కల్పించింది. ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతోపాటు మీడియా ప్రతినిధులకు, 85 ఏళ్లుదాటి మంచానికే పరిమితమైన వయో వృద్ధులు, 40 శాతం పైబడి వైకల్య ఇబ్బందులు ఎదుర్కొంటూ కదల్లేని స్థితిలో ఉన్న వికలాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సౌలబ్యాన్ని కల్పిస్తున్నారు. ఎన్నికేతర విధుల్లో ఉండే డ్రైవర్లు, నాలుగో తరగతి ఉద్యోగులనూ ఈ జాబితాలో చేర్చారు. 2019 ఎన్నికల్లో కేవలం ఎన్నికల విధుల్లోని ఉద్యోగులతో పాటు సర్వీసు ఓటర్లకు మాత్రమే ఈ సదుపాయం కల్పించారు. అప్పట్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఆరు నుంచి 8 వేల మధ్యవరకు వినియోగించుకున్నారు. ఈసారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి ఓటరూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చెరో ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా పోలింగ్‌ సిబ్బంది సంఖ్య పెరిగింది. నిర్వహణకు దాదాపు జిల్లాలో ఈసారి సుమారు 16 వేల మందికి పైగా ఉద్యోగులు అవసరం ఉందని అంచనా. ఇసి అదనంగా అనుమతి ఇచ్చిన ఉద్యోగులు సర్వీసు ఓటర్లు మరో ఐదారువేల మంది వరకు ఉన్నారు. వయో వృద్ధులు, వికలాంగులు కలుపుకుని ఈ సారి జిల్లాలో సుమారు 30 వేల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవసరం కావచ్చని, వచ్చిన దరకాస్తుల ఆధారంగా లెక్కలేసి పోస్టల్‌ బ్యాలెట్‌ను సిద్ధం చేయనున్నారు. ఎన్నికల విధులకు నియమితులయ్యే వారికి ఈ నెలాఖరులో తొలివిడత శిక్షణ ఇస్తారు. రెండో విడత శిక్షణ నిమినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ శిబిరం సమయంలో ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకొనే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక వేళ ఇక్కడ ఇష్టం కాకుంటే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఆర్‌ఒ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే డ్రాప్‌ బాక్సుల్లో వేయొచ్చు. ఎన్నికలు జిల్లాలో నాలుగో దశలో జరగనున్నాయి. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ రానుంది. 29న నామినేషన్ల గడువు పూర్తయి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తేలనున్నారు. ఆ తర్వాతే బ్యాలెట్‌ పేపర్‌ అందుబాటులోకి వస్తుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల వ్యవహార బాధ్యతలను జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకొనే వారు తమ ఓటు ఏ నియోజకవర్గం పరిధిలో ఉంది? పోలింగ్‌ కేంద్రం, వరస సంఖ్య వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.

➡️