ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న

ప్రచారం చేస్తున్న సిఐటియు నాయకులు

  • 16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలి
  • సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమ్మన్నాయుడు, తేజేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా ఈనెల 16న చేపట్టనున్న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. బంద్‌ జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని ఎన్‌జిఒ హోం నుంచి మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. మరోవైపు మత వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చీలికలు తెస్తోందన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నా రైతాంగ, కార్మిక, ప్రజల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. నేడు ఉద్యోగ కల్పన పడిపోయిందని, నిరుద్యోగం 50 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. శ్రామికుల నిజ వేతనాలు 20 శాతం తగ్గిపోయాయని తెలిపారు. మానవాభివృద్ధిలో ప్రపంచంలోని 191 దేశాల్లో ఇండియా 132వ స్థానంలో ఉందని, సంతోష జీవన సూచీలో 160వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయన్నారు. స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేస్తామన్న మాటను మోడీ మర్చిపోయారన్నారు.ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తోందని విమర్శించారు. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో వంద శాతం వాటాలు తెగనమ్ముతోందన్నారు. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్‌, పెన్షన్‌ నిధులను ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు కట్టబెడుతోందని చెప్పారు. కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదారులుగా ఉన్న ఎల్‌ఐసి వాటాలను అమ్మేందుకు తెగబడిందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని, కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందన్నారు. సమ్మె హక్కును కాలరాస్తోందని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, వెల్ఫేర్‌ బోర్డులను నిర్వీర్యం చేస్తోందని తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ఇపిఎస్‌ పెన్షన్‌ నెలకు రూ.పది వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. దేశంలో సుమారు కోటి మంది పనిచేస్తున్న కేంద్ర స్కీమ్‌లకు ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టిందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, కె.గురునాయుడు, పట్టణ నాయకులు ఆర్‌.ప్రకాష్‌, నాగార్జున అగ్రికెమ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎల్‌.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️