భూ సమస్యలను పరిష్కరించాలి

జిల్లాలో పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన మీసాల భాగ్యలక్ష్మి తనకు వారసత్వంగా వచ్చిన

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

‘స్పందన’కు 220 వినతులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన మీసాల భాగ్యలక్ష్మి తనకు వారసత్వంగా వచ్చిన భూములు ఆక్రమణలకు గురైనట్టు స్పందనలో జిల్లా కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలానీ సమూన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ఆయన వినతులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 220 వినతులు వచ్చాయి. తన తండ్రి మీసాల ఆనందరావుకు వివిధ సర్వేనంబర్ల పరిధిలో బురిడి కంచరాంలో 3.46ఎకరాల భూములు ఉన్నాయని, వాటిని వంశపారంపర్యంగా తల్లిదండ్రుల మరణానంతరం తనకు పూర్తి ఆస్తిహక్కు కలిగి ఉన్నట్టు తెలిపారు. ఆ భూములను ప్రస్తుతం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, పొందూరు తహశీల్ధారు కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఇంతవరకు సమస్యను పరిష్కరించలేదని భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార ప్రాజక్టు పరిధిలో పాడలి గ్రామానికి చెందిన నీలకంఠం తన భూమికి నష్ట పరిహారం చెల్లించాలని ఫిర్యాదు అందించారు. సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి తన భూమికి పరిహారం చెల్లించకుండా పోర్టు పరిధిలో భూసేకరణ జరిపారని, స్థానికంగా లేని కారణంగా పరిహారం అందుకోలేక పోయానని తెలిపారు. హిరమండలం మండలం చిన కోరాడ కాలనీకి చెందిన మగ్గు తిరుపతిరావు తనకు అదనపు పరిహారం చెల్లించాలని కోరారు. అదే గ్రామానికి చెందిన సిరిపల్లి లీల నిర్వాసితుల కాలనీలో స్థలం మంజూరు చేసినప్పటికీ ఇంటి నిర్మాణానికి పరిహారం చెలిలంచలేదని ఫిర్యాదు చేశారు. చిన్న కోరాడ గ్రామానికి చెందిన బొడ్డు తులసమ్మ గతంలో ప్రభుత్వం తనకిచ్చిన ఇంటి స్థలం కబ్జాకు గురైందని ఆక్రమణలు తొలగించి స్థలాన్ని తనకు ఇప్పించాలని కోరారు. కాశీబుగ్గ పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం నెహ్రూ నగర్‌లో తాను కొనుగోలు చేసుకున్న ఇంటి స్థలాన్ని కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని, అన్ని పత్రాలు తన వద్ద ఉన్నా రెవిన్యూ సిబ్బంది తన స్థలాన్ని అప్పగించడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందనలో వస్తున్న ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ డా. మనజీర్‌ జిలానీ సమూన్‌ జిల్లా అధికారులను హెచ్చరించారు. వినతుల స్వీకరణ అనంతరం అంధులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ వినతులను స్వీకరించారు. ఇచ్ఛాపురంలో బిర్లంగ్‌ 2020-21లో సచివాలయానికి రంగులు, మరమ్మతులు చేపట్టామని, దానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని బాధితుడు తిరుపతిరావు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కెఆర్‌సి ప్రత్యేక ఉప కలెక్టర్‌ దొరబాబు, జెడ్‌పి సిఇఒ డి.వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి బి.మీనాక్షి, డ్వామా పీడీ చిట్టి రాజు, డిసిహెచ్‌ఎస్‌ డా.రాజ్యలక్ష్మి, హౌసింగ్‌ పిడి గణపతిరావు, వంశధార ఎస్‌ఇ డోల తిరుమల రావు, సమగ్ర శిక్ష ఎపిసి రోణంకి జయప్రకాష్‌, డిపిఒ రవికుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.జాబ్‌మేళా పోస్టర్‌ విడుదల చిలకపాలెం శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యాన ఈనెల 15న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ జాబ్‌మేళాలో 13 ప్రైవేట్‌ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు. పదో తరగతి నుంచి పిజి వరకు ఏదైనా విద్యార్హత కలిగి ఉన్న నిరుద్యోగ యువత సద్వినియోగ పరచుకోవాలని కలెక్టర్‌ సూచించారు. మరిన్ని వివరాలకు 9550967353, 8317652552 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

 

➡️