రాష్ట్ర ఖజానా ఖాళీ

ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి అవినీతి

రవికుమార్‌

  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి- ఆమదాలవలస

ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి అవినీతి పాలనకు రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అవ్వతాతలంటూ నాటకాలు ఆడిన సిఎం జగన్‌ ఏప్రిల్‌ నెల పింఛను డబ్బును తన అవినీతి కమీషన్ల కోసం రూ.13 వేలు కోట్లు చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రభుత్వ విధులు నిర్వహించకుండా వైసిపి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే బాగుంటుందని రవికుమార్‌ వంగ్యంగా మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల నగదు పంపిణీ చేయకుండా మిగిలిన సచివాలయ ఉద్యోగులతో నిర్ణీత సమయాలలో ఎప్పటి లాగానే పంపిణీ చేయాలని ఆదేశించారని అన్నారు. దానిని సిఎం నుంచి క్షేత్రస్థాయి వైసిపి నాయకుల వరకు వక్రీకరించి ప్రతిపక్షాలపై బురద చల్లడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఖజానాకు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడలేదని వ్యాఖ్యానించారు.

➡️