రేపట్నుంచి ప్రత్యక్ష ఆందోళనలు

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను

మాట్లాడుతున్న సాయిరాం

  • ఎపి జెఎసి జిల్లా అధ్యక్షులు సాయిరాం

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరికి నిరసనగా ఈనెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టనున్నట్ల ఎపి జెఎసి జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం తెలిపారు. నగరంలోని ఎన్‌జిఒ హోంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ పిఆర్‌సిలో 30శాతం ఫిట్‌మెంటు వెంటనే ప్రకటించాలని, సిపిఎస్‌, జిపిఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు డిఎలను వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్‌ వారికి డిఎ బకాయిలు 90 శాతం నగదు రూపంలో చెల్లించాలన్నారు. 11వ పిఆర్‌సిలో ఇప్పటికీ ఎరియర్స్‌, సరెండర్‌ లీవ్‌ బకాయిలు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ క్లయిమ్‌లు వెంటనే చెల్లించాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో ప్రవేశపెట్టిన అప్రెంటిషిప్‌ను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలన్నారు. గురుకులాలు, సొసైటీ లు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, గతంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత కింద కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 14న తాలూకా, జిల్లాస్థాయిలో నల్లబ్యాఢ్జలతో నిరసన తెలపడంతో పాటు తహశీల్దార్‌, ఆర్‌డిఒలు, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. 15, 16 తేదీల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన, 17న తాలూకా స్థాయిలో ర్యాలీలు, 20న జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. 21 నుంచి 24 వరకు రాష్ట్ర నాయకులు జిల్లాలో పర్యటిస్తార ని, 27న చలో అసెంభ్లీ చేపట్టనున్నట్లు చెప్పారు. వీటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ నాయకులు బడగల పూర్ణచంద్రరావు, ఆర్‌.వేణుగోపాల్‌, పూజారి జానకిరామ్‌, కె.రోజారాణి, బొత్స శ్రీనివాసరావు, జి.లలిత, ఎ.సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️