రైతుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం

వ్యవసాయాధారిత జిల్లాలో వ్యవసాయ సలహా మండలి తీసుకునే నిర్ణయాలు రైతాంగానికి విస్తృత ప్రయోజనం

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వ్యవసాయాధారిత జిల్లాలో వ్యవసాయ సలహా మండలి తీసుకునే నిర్ణయాలు రైతాంగానికి విస్తృత ప్రయోజనం కల్పించేవిగా ఉండాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న అనుబంధ శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆయా రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు, పశుసంవర్థక, మత్స్య, పట్టు పరిశ్రమ తదితర శాఖల్లో ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నకిలీలు లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లా నుంచి ప్రభుత్వానికి పంపిన నివేదికలపై అడిగి తెలుసుకున్నారు. శాఖల వారీగా నిర్ణయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, ఉచిత విద్యుత్‌, స్మార్ట్‌ మీటర్లు, ఇన్పుట్‌ సబ్సిడీ , పశు భీమా, మట్టి నమూనాలు తదితర అంశాలపై వివరాలు అడిగారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు చెల్లింపులు రెండు వారాల్లో పూర్తి చేయాలన్నారు.వంశధార పై సుదీర్ఘ చర్చవంశధార ప్రాజెక్టు స్థితిగతులపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఒడిశాతో నేరడి వివాదాన్ని, సైడ్‌వియర్‌ పనితీరు, సింగిడి, పారపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ లను గురించి అడిగి తెలుసుకున్నారు. హిరమండలం ప్రధాన రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజ్‌పై పలు ప్రశ్నలు అడిగారు. రిజర్వాయర్‌ పనులు 95 శాతం పూర్తి అయనట్టు, ప్యాకేజీ 87, 88 పనులను, కాలువల పరిస్థితిని ప్రాజెక్టు ఎస్‌ఇ డోల తిరుమలరావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రధాన రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం ఎత్తిపోతల పథకం మంజూరు చేసిందని, 20 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది గొట్టా నుంచి నీటిని పంపుల ద్వారా రిజర్వాయర్‌కి తరలించి 19 టిఎంసిల నీటిని నిల్వ ఉంచడమే లక్ష్యమన్నారు. నేరడి బ్యారేజీ, వంశధార ట్రిబ్యునల్‌, స్టేజ్‌-1, స్టేజ్‌-2, ఆఫ్‌షోర్‌, మడ్డువలస, నారాయణపురం పనుల గురించి కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ జెడిలు కె.శ్రీధర్‌, ఎం.కిషోర్‌, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ శిమ్మ నేతాజీ, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ పి.సుధాకరరావు, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్‌ డిఎం రమణి, ఉద్యానశాఖ అధికారి ఆర్‌.వి.వి ప్రసాద్‌, మార్కెటింగ్‌ ఎడి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️