రైస్‌, ఆయిల్‌ మిల్లు కార్మికుల ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్లు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం

ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్లు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, చైతన్య రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్లు వర్కర్స్‌ యూనియన్‌ కన్వీనర్‌ హెచ్‌.ఈశ్వరరావు, కో-కన్వీనర్‌ కె.సూరయ్యలు హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ఆర్‌అండ్‌బి బంగ్లా నుంచి కలెక్టరేట్‌ వరకు సోమవారం ప్రదర్శన నిర్వహించి అనంతరం మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్లుల్లో ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, అతితక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్‌ మిల్లులో పనిచేస్తున్న కార్మికుల హాజరు వివరాలను యాజమాన్యాలు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, 8 గంటల పనిదినం వంటి కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేయడం లేదని విమర్శించారు. కార్మికులు తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయని డిమాండ్‌ చేశారు. ఐఎల్‌ఒ నిబంధనల ప్రకారం 50 కేజీలు బస్తా ఉపయోగించాలని, కానీ జిల్లాలో ఈ నిబంధనను పాటించకుండా 80 కిలోల బస్తాలను వినియోగిస్తున్నారని అన్నారు. దీనివల్ల అధిక బరువులు మోయలేక అనేక మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాలు కార్మికులతో అధిక బరువులు మోయించడంతో కార్మికుల అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరికీ ప్రమాద బీమా అమలు చేయాలన్నారు. ధర్నాలో చైతన్య రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు కె.కేశవరావు, జి.నీలన్న, ఎస్‌.ఆనంద్‌, బి.అప్పారావు, జి.గురువులు, పి.అప్పన్న, బి.కృష్ణారావు, పి.రమేష్‌, బి.రామారావు, బి.రాజారావు, జి.అప్పారావు పాల్గొన్నారు.

 

➡️