విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల భద్రతపై కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ

సమీక్షిస్తున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం

విద్యార్థుల భద్రతపై కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లాలోని వివిధ కళాశాలలు యాజమాన్యంతో విద్యార్థుల భద్రత, ఆత్మహత్యలు నివారణ వంటి అంశాలపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల లు, పాఠశాలలు, వసతిగృహాలకు వచ్చిన విద్యార్థినీ విద్యార్థుల ప్రవర్తనను సిసి టివి కెమెరాల ద్వారా పర్యవేక్షించే విధంగా చేసుకోవాలన్నారు. కళాశాల లేబొరేటరీస్‌, ప్రిమిసెస్‌, క్లాస్రూమ్స్‌, లైబ్రరీస్‌, కారిడోర్స్‌, స్టాఫ్‌ రూమ్స్‌ల్లో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులను కౌన్సెలింగ్‌ నెపంతో తరచుగా పిలుస్తున్నారన్న విషయంపై కాలేజ్‌ యాజమాన్యం దృష్టి చారించాలన్నారు. కాలేజీలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించినప్పుడు వారి నేర ప్రవృత్తి, పూర్వాపరాలు అన్ని పరిశీలన చేసి తీసుకోవాన్నారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పుడు మహిళా సిబ్బంది కచ్చితంగా వారితో పాటు ఉండాలన్నారు. లేబొరేటరీస్‌లో ప్రాక్టికల్‌ వర్క్‌ విద్యార్థినులు వెళ్లినప్పుడూ వారితో మహిళా సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్నారు. కళాశాలలో శారీరక దండన, కార్పొరేట్‌ కల్చర్‌ ఎడ్యుకేషన్‌, అందరు పిల్లల ముందు అవహేళన చేయడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. కళాశాలల వద్ద ర్యాగింగ్‌ జరగకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. హాస్టల్లో నిరంతర పర్యవేక్షణకు తప్పనిసరిగా వార్డెన్‌ని ఏర్పాటు చేయాలన్నారు. బాలికల హాస్టళ్ల వద్ద తప్పనిసరిగా మహిళా వార్డెన్‌నే నియమించాలన్నారు. కారిడోర్స్‌, బాల్కనీ ఉన్న చోట్ల పిట్ట గోడల పైనుంచి క్లోజ్డ్‌ గ్రిల్స్‌, క్లోజ్డ్‌ మెష్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థుల ప్రవర్తన, మార్పులపై శ్రద్ధ వహించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే విధంగా చర్యలు చేపట్టారు. తరచుగా సైకియాట్రిస్టు, మోటివేషనల్‌ స్పీకర్స్‌ ద్వారా పిల్లల్లో మనోధైర్యాన్ని నింపే విధంగా క్లాసెస్‌ కండక్ట్‌ చేయాలన్నారు. పరీక్షలు, ఫలితాల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలన్నారు. క్యాంపస్‌ కాప్స్‌, చిన్నారికి చేదోడు కార్యక్రమాల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత సమస్యల నివారణకు, వారు ఒత్తిడికి గురికుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్‌ఐఒ పి.దుర్గారావు మాట్లాడుతూ విద్యార్థులకు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించి నిత్యం యోగా, ధ్యానం వంటి ప్రక్రియలు పది నిమిషాలు చేసే విధంగా కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి డాక్టర్‌ జి.ప్రేమ్‌ కాజల్‌, డిఎస్‌పి ఎ.విజయకుమార్‌, సిఐలు ఉమామహేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐలు, వివిధ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

➡️