సామాజిక పింఛన్ల పంపిణీకి ప్రణాళిక

సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • సిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. జిల్లాలో 732 సచివాలయాల ద్వారా ఒక్కో సచివాలయానికి సగటున 456 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డితో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధానంగా పింఛనుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వేసవిలో తాగునీటి సరఫరా, ఉపాధి హామీ అమలు, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై జరిగిన సమీక్షలో కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. చెరువులను, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో నీటిని భద్రపరచడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నీటి నిల్వలను సవరించి వేసవిలో తాగునీటి సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే సమగ్ర నివేదికలను సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే వడదెబ్బకు గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పనుల్లో నీటి సంరక్షణ పనులు, తాగునీటి చెరువుల డీసిల్టింగ్‌ పనులకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జెసి ఎం.నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కె.శ్రీధర్‌, ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి వాసుదేవరావు, డిపిఒ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ ఎన్‌.వి.చిట్టిరాజు, డిజాస్టర్‌ మేనేజ్‌ంట్‌ నుంచి పి.రాము పాల్గొన్నారు.

➡️