అంగన్వాడీల సమ్మె ఉధృతం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర

ఎమ్మెల్యే రెడ్డి శాంతి కారును అడ్డుకున్న అంగన్వాడీలు

  • కొత్తూరులో ఎమ్మెల్యే రెడ్డి శాంతి అడ్డగింత
  • అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
  • బూర్జలో నాగావళి నదిలో మానవహారం

ప్రజాశక్తి – విలేకరుల యంత్రాంగం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. గురువారానికి సమ్మె పదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా మానవహారాలు, ఇతర రూపాల్లో నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. పాతపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి కారును కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద అంగన్వాడీలు అడ్డుకున్నారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కారు దిగి తమ వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తన వద్దకు వచ్చి ఇవ్వాలని ఎమ్మెల్యే చెప్పడంతో, కారును చుట్టుముట్టారు. అంగన్వాడీలను పక్కకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీలు ఎంతసేపటికీ పక్కకు తప్పుకోకపోవడంతో, చివరకు ఎమ్మెల్యే వారి వద్దకు వచ్చారు. అంగన్వాడీల సమస్యలను సిఎం నెరవేరుస్తారని, అందుకు కొంత సమయం ఇవ్వాలన్నారు. సమ్మెను విరమించాలని కోరగా, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అనంతరం అంగన్వాడీలు పక్కకు తప్పుకోవడంతో ఎమ్మెల్యే కారులో వెళ్లిపోయారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు లక్ష్మి, హేమ, ధనలక్ష్మి, సిఐటియు నాయకులు నిమ్మక అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టిన వారిపై కేసులు నమోదు చేసి, కేంద్రాలకు రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, కేంద్రాల తాళాలను పగులగొట్టించడం నేరమన్నారు. ఈ కేంద్రాల్లో నిర్వహణ సామగ్రితో పాటు రికార్డులు ఉన్నాయని, వాటి సంరక్షణకు పోలీసు రక్షణ అవసరమన్నారు. అంతకుముందు ఐసిడిఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు సందర్శించి సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అర్బన్‌ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు టి.రాజేశ్వరి, అధ్యక్షులు కె.ప్రమీలాదేవి, నాయకులు డి.ఇందుమతి, సిహెచ్‌.అరుణ తదితరులు పాల్గొన్నారు. బూర్జలో నాగావళి నదిలో అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జ్యోతి, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం పట్టణంలోని బస్టాండ్‌ వద్ద మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.లకీëనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మందసలో బస్టాండ్‌ వద్ద మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి హైమావతి, సిఐటియు నాయకులు పి.దేవేంద్ర, రైతుసంఘం మండల కార్యదర్శి ఎం.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. సోంపేట పట్టణంలోని గాంధీ మండపం కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సంగారు లక్ష్మీనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమదాలవలసలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పి.లతాదేవి, భూలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు. పొందూరులో పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని కూడలిలో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.జ్యోతిలక్ష్మి, జి.నాగరత్నం, ఎస్‌.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, డి.ఆదిలక్ష్మి, పి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పలాసలో కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీల సమ్మెకు సిపిఐ నియోజకవర్గ నాయకులు చాపర వేణుగోపాల్‌, గోరు వాసుదేవరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలంలో నిర్వహించిన ధర్నాలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

➡️