ఈశ్వరరావు
అభ్యర్థిగా ఎన్.ఈశ్వరరావు ఖరారు
భగ్గుమన్న ‘కళా’ వర్గీయులు
ఎచ్చెర్ల టిక్కెట్ బిజెపికే ఖరారైంది. బిజెపి విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఇఆర్) పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ సీటుపై ఆశపెట్టుకున్న కళావెంకటరావు గ్రూపు నాయకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎన్‌ఇఆర్‌కు సామాజిక తరగతి బలం లేదని, గతంలో భూ ఆక్రమణ కేసులు ఉన్నాయని టిడిపి నాయకులు పార్టీ అధిష్టానానికి చేసిన ఫిర్యాదులు ఫలించలేదు. అయినా బిజెపి అధిష్టానం ఎన్‌ఇఆర్‌కే సీటును కేటాయించింది. ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధికూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం టిడిపికి తలనొప్పిగా మారింది. జిల్లాలో బిజెపికి ఎక్కడ టిక్కెట్ ఇస్తే అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. తొలుత శ్రీకాకుళం సీటును బిజెపికి ఇచ్చారంటూ ప్రచారం సాగింది. నియోజకవర్గంలో బిజెపి నాయకులు కుమ్ములాటలు, ఫిర్యాదుల ఫలితంగా శ్రీకాకుళం స్థానాన్ని వదులుకొని ఎచ్చెర్ల సీటును కోరుకుంది. ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులుగా ఉన్న ఈశ్వరరావు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరితో చేసిన లాబీయింగ్ ఫలితంగా ఆ సీటును దక్కించుకున్నట్లు తెలిసింది. ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోకే వచ్చిందంటూ కేంద్ర పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టించారని జిల్లాకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా చివరకు ఎన్‌ఇఆర్ పేరునే కేంద్ర పార్టీ ఖరారు చేసింది. భగ్గుమన్న ‘కళా’ వర్గీయులు ఎచ్చెర్ల సీటు ఎన్‌ఇఆర్ ఖరారు కావడంతో మాజీ మంత్రి కళావెంకటరావు వర్గీయులు భగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు తమ నేతకే సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. బిజెపి అభ్యర్థిపై టిడిపి అభ్యంతరంఎచ్చెర్ల సీటు బిజెపికి కేటయించడంపై టిడిపి శ్రేణలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిజెపి అభ్యర్థిగా ఎన్‌ఇఆర్‌ను ప్రకటించడంపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్‌ఇఆర్‌ను తప్పించడానికి చంద్రబాబుకు టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. కాపులు ప్రాబల్యం ఉన్న ఎచ్చెర్ల నియోజకర వర్గంలో కమ్మ తరగతికి చెందిన ఎన్‌ఇఆర్‌కు బలం అంతగా లేదని, గెలుపు కష్టమని టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు టిడిపి హయాంలో భూ ఆక్రమణలను సైతం అధిష్టానం దృష్టికి నాయకులు తీసుకెళ్లారు.ఎన్‌ఇఆర్‌కి కష్టమే?గత ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో బిజెపికి డిపాజిట్లు కూడా దక్కలేదు. నియోజకవర్గంలో బిజెపి కేడర్ చాలా బలహీనంగా ఉంది. దీంతో పాటు సామాజిక తరగతి బలం కూడా లేకపోవడంతో ఎన్‌ఇఆర్ గెలిచే పరిస్థితి లేదని టిడిపి నాయకులే చెబుతున్నారు. కళావెంకటరావుకు టిక్కెట్ దక్కకపోవడంతో టిడిపి కేడర్ ఎంతవరకు సహకరిస్తుందోనని సందేహంగా ఉంది. మొత్తంమీద ఆ సీటులో ఎన్‌ఇఆర్ గట్టెక్కడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.