ఓట్ల కోసమే చంద్రబాబు బిసిల జపం

ఎన్నికలకు వస్తుండటంతో చంద్రబాబు మరోసారి బిసిల జపం

రవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఎన్నికలకు వస్తుండటంతో చంద్రబాబు మరోసారి బిసిల జపం చేస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక టౌన్‌ హాల్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిసి జయహో అంటూ ఆ తరగతులను మభ్యపెట్టే పని చంద్రబాబు మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. బిసిలకు రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ కలగలేదన్నారు. బిసిలకు చెందిన ఒక్క వ్యక్తినీ రాజ్యసభకు పంపలేదని, అటువంటి నాయకుడు ఆ తరగతులకు రాజకీయ అధికారం ఇస్తారని ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాజ్య సభకు నలుగురిని పెద్దల సభకు పంపారని గుర్తుచేశారు. బాబు పాలనలో బిసిల పేరుతో కొన్ని కార్యక్రమాలు అమలు చేయడం, వాటిలో కొన్నింటిని పంచి, మిగిలనవి సొంత మనుషులకు ఇచ్చేయడం చేశారని చెప్పారు. వైసిపి ప్రభుత్వం డిబిటి ద్వారా బిసిలకు రూ.1.22 లక్షల కోట్లను అందించామని అన్నారు. సబ్‌ప్లాన్‌పై టిడిపి విమర్శలు చేస్తోందని, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బిసిలకు ఆర్థిక సాయంగా తమ ప్రభుత్వం అందించిందని చెప్పారు. బిసిలకు సామాజిక న్యాయం విషయంలో వైసిపికి, టిడిపికి ఒక చర్చా వేదిక నిర్వహించి చంద్రబాబు గాని, టిడిపి నాయకులు రావాలని సవాల్‌ విసిరారు. వైసిపి హయాంలో బిసి సామాజిక తరగతులకు చెందిన 12 మంది మంత్రులు రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్నారని అన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ తరగతులకు జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం ఇచ్చారని చెప్పారు. బాబు చుట్టూ ఉన్నది ధనవంతుల కూటమని, వారి ప్రయోజనాలు తప్ప పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచలేరని చెప్పారు. జయహో బిసి పేరుతో చంద్రబాబు చెప్పే మోసపూరిత మాటలను ఎవరూ నమ్మరని అన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికారం చేజిక్కుంచుకోవడానికి తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పే మాటలు విని మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

➡️