కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు

జిల్లాలో కేన్సర్‌ రోగులకు వైద్యం అందించాన్న సంకల్పంతో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జెసి నవీన్‌

కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో కేన్సర్‌ రోగులకు వైద్యం అందించాన్న సంకల్పంతో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యాన అత్యున్నత ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటు న్నామని శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. మగటపల్లి రమణమూర్తి ఛారిటబుల్‌ ట్రస్టు ఆర్థిక సాయంతో రూ.25 లక్షలతో నిర్మించిన శాంతా కళ్యాణ్‌ అనురాగ నిలయం రక్షిత గృహం (బాలురు), సి.వి.నాగజ్యోతి ఆనంద నిలయం (పురుషుల వృద్ధాశ్రమం) భవనాలను శనివారం జెసి ఎం.నవీన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే జిల్లా వాసులతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఏడెకరాల స్థలం కేటాయించామని, త్వరలోనే అన్ని అనుమతులు వస్తాయని ఆశిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌, వెల్లూరు వంటి దూరాలకు వెళ్లి కేన్సర్‌ రోగులు జిల్లా నుంచి ఎంతో ప్రయ, ప్రయాసలకు లోనవుతున్నారని అన్నారు. కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఇకపై ఆ కష్టం తప్పుతుందన్నారు. ఆలాగే ఆటిజం కోసం ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెడ్‌క్రాస్‌ కోసం చేసిన ప్రతి పనీ తన మనసుకు ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. జెసి మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సేవా దృక్పథంతో అందరూ బాగుండాలని, ఎదుటి వారి కోసం తమ సమయాన్ని, డబ్బు, శ్రమ కేటాయించడం హర్షణీయమని అన్నారు. రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ కలెక్టరేట్‌ దగ్గరలో 32 సెంట్ల స్థలంలో వృద్ధాశ్రమం, ఇప్పుడు రక్షిత గృహం రెండు భవనాలు కలెక్టర్‌తో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రెడ్‌క్రాస్‌ జిల్లా కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సి.వి.ఎన్‌.మూర్తి, కంటి వైద్యులు పి.ఎల్‌.ఎన్‌.రాజు, ఎన్‌ఎసిఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వరదరాజులు, కనుగుల దుర్గాశ్రీనివాస్‌, బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ ప్రసాదరావు, పి.వైకుంఠరావు, డాక్టర్‌ కృష్ణంరాజు, సత్యనారాయణ, పెంకి చైతన్యకుమార్‌, డాక్టర్‌ సోమేశ్వరరావు, నిక్కు అప్పన్న పాల్గొన్నారు.

 

➡️