నేడు భవిష్యత్‌ నిర్ణయం

తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు దక్కని గుండ కుటుంబం

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

శ్రీకాకుళం అర్బన్‌ :

తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు దక్కని గుండ కుటుంబం తమ భవిష్యత్‌ కార్యాచరణను మంగళవారం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు చెప్పారు. నగరంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్‌ల టిడిపి ఇన్‌ఛార్జీలు, నగరానికి చెందిన ముఖ్య నాయకులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డామని అన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో 53 రోజుల పాటు నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరంతరాయంగా శ్రమించామని చెప్పారు. అయినా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తనకు టిక్కెటు రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అసమ్మతి వాదిగా ఉన్న వ్యక్తిని ప్రోత్సహించి టిక్కెట్టు ఇవ్వడం బాధ కలిగిందన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ప్రజలు ఇప్పుడు వారి వెంట నడిచేందుకు సిద్ధంగా లేరని తెలిసి కూడా పార్టీకి నష్టం చేకూర్చే చర్యలను ప్రోత్సహించి అసమ్మతివాదికి టిక్కెట్టు ఇచ్చారని వాపోయారు. అటువంటి వ్యక్తి వెంట ఎలా నడవాల్లో కార్యకర్తలే చెప్పాలన్నారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్‌ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. సమావేశంలో నగర టిడిపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదారపు వెంకటేష్‌, చిట్టి నాగభూషణం, జామి భీమశంకరరావు, తోణంగి వెంకన్న యాదవ్‌, ఉంగటి రమణ, విభూది సూరిబాబు పాల్గొన్నారు.

 

➡️