బదిలీల జోరు

ఎన్నికల విధులతో
  • మూడేళ్ల సర్వీసు ఉన్న అధికారులకు స్థానచలనం
  • ఒక్కొక్కరుగా కదలుతున్న పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు
  • తహశీల్దార్ల బదిలీల్లో తాత్సారం

సార్వత్రిక ఎన్నికల పోరుకు సమయం దగ్గర పడుతుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారుల బదిలీల ప్రకియ జోరందుకుంది. మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న జిల్లా, మండల అధికారులతో పాటు సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు స్థాన చలనం కల్పిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ను ఈనెల 28న అమరావతిలోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు బదిలీ చేశారు. పోలీసు శాఖలో సిఐలు, ఎస్‌ఐలకు స్థానచలనం కల్పించారు. పంచాయతీరాజ్‌శాఖలో ఎంపిడిఒలనూ బదిలీ చేశారు. తహశీల్దార్ల బదిలీలకు సంబంధించి నేడో, రేపో జాబితాలు విడుదల చేయనున్నారు. సార్వత్రిక సంగ్రామానికి సంబంధించి తొలి అంకమైన ఉద్యోగుల బదిలీలు పూర్తి కావస్తుండడంతో ఎన్నికల వేడి మరింత పెరగనుంది.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులను జనవరి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో రెవెన్యూ శాఖ పాత్ర ఎంతో కీలకం. ఓటరు జాబితా తయారీ దగ్గర నుంచి ఎన్నికల ముగిసే వరకు వీరి పాత్ర అడుగడుగునా ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగంలో ముఖ్య భూమిక పోషించే తహశీల్దార్ల బదిలీల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఎంపిడిఒలను బదిలీ చేసిన ప్రభుత్వం, తహశీల్దార్ల విషయానికి వచ్చేసరికి తాత్సారం చేయడంపై పలు సందేహాలకు తావిస్తోంది.పైరవీల ప్రభావంతహశీల్దార్ల బదిలీల్లో జోరుగా పైరవీలకు తెర తీసినట్లు ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. తమకున్న పలుకుబడి, అధికార పార్టీ నేతల అండతో నచ్చిన చోటుకు బదిలీ అయ్యేలా కొంతమంది చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్‌ జిల్లా బదిలీలు కావడంతో ముందుగానే అక్కడి పరిస్థితులను తెలుసుకుని, అనుకున్న చోటుకు బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగుల బదిలీలు పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయి. అయితే బదిలీలు తయారు చేసే జాబితా మాత్రం ప్రభుత్వ అనుకూలంగా ఉన్న అధికారుల చేతిలో ఉండడంతో, వారి ద్వారానే పని చేయించుకుంటున్నట్లు తెలిసింది. అమరావతిలోని రెవెన్యూ శాఖకు చెందిన ఓ కీలక మహిళా అధికారి బదిలీల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని, జాబితాలను తారుమారు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన ఇద్దరు తహశీల్దార్లను వేరే చోటుకు పంపి, వారి స్థానంలో విశాఖ నుంచి ఇద్దరు తహశీల్దార్లను కలెక్టర్‌కు తెలియకుండా బదిలీ చేస్తూ భూపరిపాలనా కమిషనర్‌ శాఖ కార్యాలయం గట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఉన్నతాధికారులు ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు.బదిలీల్లో జాప్యం వెనుక కారణం అదేనా? తహశీల్దార్ల బదిలీల్లో జాప్యానికి పరిపాలనా సంబంధ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవాప్తంగా ప్రస్తుతం పెద్దఎత్తున జగనన్న ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణీ సాగుతోంది. తహశీల్దార్లను బదిలీ చేస్తే ఆ పనికి ఆటంకం కలుగుతుందని భావించిన ప్రభుత్వం, వారిని కొద్ది రోజుల పాటైనా ఉంచాలని అనుకున్నట్లుగా చర్చ నడుస్తోంది. తహశీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తికి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు గడువు కోరినట్లుగా సమాచారం. ఎన్నికల కమిషన్‌ గడువు ఇస్తే, వీటితో పాటు అసైన్డ్‌ ల్యాండ్‌ పట్టాలకు పత్రాలు, ఇతర లక్ష్యాలనూ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు ఎన్నికల సంఘం అంగీకరించకపోవచ్చని అధికారులు చెప్తున్నారు.

➡️