రాజమండ్రి నుంచి కొబ్బరి దిగుమతి

ఓవైపు దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి నిస్పృహలో ఉన్న కొబ్బరి రైతుకు కొబ్బరికాయలు వ్యాపారం చేస్తున్న

దళారితో మాట్లాడుతున్న రైతులు

అడ్డుకున్న ఉద్దానం రైతులు

ప్రజాశక్తి – కవిటి

ఓవైపు దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి నిస్పృహలో ఉన్న కొబ్బరి రైతుకు కొబ్బరికాయలు వ్యాపారం చేస్తున్న కొంతమంది దళారులు కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా కొబ్బరికాయలు దిగుమతి చేసి స్థానిక కొబ్బరి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. మొదటి నుంచీ కవిటి మండలం కొబ్బరికి నాణ్యత, పరిమాణంలో మంచి పేరు ఉండడంతో మిగతా ప్రాంతాల కొబ్బరి ధర కంటే అధికంగా చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొబ్బరి దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఐదెకరాలు ఉన్న కొబ్బరి రైతుకు వెయ్యి కొబ్బరికాయలకు మించి దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటీవల కాలంలో మండలంలో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.22 వేలకు చేరుకుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కవిటి మండలం వరకలో ఉంటున్న ఓ కొబ్బరికాయల దళారీ రాజమండ్రి నుంచి సుమారు లక్ష కొబ్బరి కాయలు అతితక్కువ ధరకు దిగుమతి చేసి గ్రామంలో నిల్వ చేసి ఉంచాడు. వాటిని స్థానికంగా ఉన్న రూ.22 వేల ధరకు విక్రయించేందుకు కొంతమంది బయట వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో మండలం మొత్తం చూసినా దొరకని కాయలు తమ గ్రామంలో ఉండడం గమనించిన వైసిపి నాయకుడు, స్థానిక రైతు శ్రీకాంత్‌ పురియా స్థానిక కొబ్బరి రైతులను అప్రమత్తం చేశాడు. దీంతో బుధవారం ఉదయం అక్రమంగా దిగుమతి చేసిన కొబ్బరికాయల వద్దకు రైతులందరూ చేరుకున్నారు. సదరు దళారీని నిలదీశారు. అయినప్పటికీ ఆ దళారి తనకు లైసెన్స్‌ ఉందని, మార్కెట్‌ కమిటీకి రుసుం చెల్లించే వ్యాపారం సాగిస్తున్నానంటూ బుకాయించేందుకు ప్రయత్నించాడు. దీంతో కొంత మంది రైతులు మార్కెట్‌ కమిటీ ప్రతినిధులను సంప్రదిస్తే వారు చేతులెత్తేశారు. దీంతో చేసిన తప్పుకు రూ.50 వేలు పరిహారం చెల్లించి, భవిష్యత్‌లో ఇటువంటి అక్రమాలకు పాల్పడనని లిఖితపూ ర్వకంగా తెలియజేయడంతో రైతులు విడిచిపెట్టారు. అనంతరం రైతులు బడగల చిట్టిరాజు, తమరాల రమణ, బెండి యతేంద్రనాథ్‌ తదితరులు మాట్లాడుతూ కొంతమంది దళారీల వల్ల కొబ్బరి మార్కెట్‌ పూర్తిగా నాశనమైందని, ఇప్పటికే దిగుబడి లేక దిగాలు పడిన కొబ్బరి రైతుకు ఇటువంటి సంఘటనలు కోలుకోలేని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్పు అప్పలరాజు, దేవరాజ్‌ పురియా, జగదీష్‌ బిసాయి పాల్గొన్నారు.

 

➡️